కేసీఆర్‌ దీ... జ‌గ‌న్ వ్యూహ‌మే!

Update: 2019-03-30 01:30 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ‌లోనూ రాజ‌కీయాల్లోకి కొత్త ముఖాలు వ‌చ్చేశాయి. సీట్ల సంఖ్య పెర‌గ‌కున్నా... రెండు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలె కొత్త వారికి ఆవ‌కాశాలిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ దిశగా అంద‌రి కంటే కూడా ఎక్కువ మంది కొత్తొళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించిన పార్టీ వైసీపీ నిల‌వ‌గా... ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ విష‌యంలో చాలా డేరింగ్ గానే ముందుకు సాగుతున్నార‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా ఎక్కువ మంది కొత్త నేత‌ల‌ను జ‌గ‌న్ రంగంలోకి దించారు. ఎంపీ సీట్ల‌కు జ‌గ‌న్ ఎంపిక చేసిన జాబితాను చూస్తే... ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఎందుకంటే... మెజారిటీ సీట్ల‌లో అప్పటిదాకా పెద్ద‌గా రాజ‌కీయ అనుభ‌వ‌మే లేని వారికి ఆయ‌న టికెట్లిచ్చారు. మ‌రి జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా?  బెడిసికొడుతుందా? అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... జ‌గ‌న్ అనుస‌రించిన వ్యూహంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింద‌నే చెప్పాలి.

ఇప్పుడు జ‌గ‌న్ బాట‌లోనే - ఆయ‌న అనుస‌రిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే వ్య‌వ‌హ‌రించేందుకు టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌ రావు కూడా ప‌య‌నించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఒక్క లోక్ స‌భ ఎన్నిక‌లే జ‌రుగుతున్నా... ఇక్క‌డ అందుబాటులో ఉన్న అతి కొద్ది సీట్ల‌కు కూడా కేసీఆర్ కొత్త వారినే బ‌రిలోకి దింపుతున్న వ్యూహం నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. కేసీఆర్ వ్యూహం ఏమిట‌న్న విష‌యాన్ని వ‌దిలేస్తే... ఆయ‌న వ్యూహాన్ని కాస్తంత ప‌రికించి చూస్తే... తెలంగాణ‌లో మొత్తం ఎంపీ సీట్లు 17. ఈ సీట్ల‌లో హైద‌రాబాద్ ఎంపీ సీటును మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌జ్లిస్‌ కు కేటాయించేసిన కేసీఆర్‌... స్నేహ‌పూర్వ‌క పోటీ కింద టీఆర్ ఎస్ అభ్య‌ర్థిని కూడా బ‌రిలోకి దింపారు. ఈ సీటును ప‌క్క‌న‌పెడితే.. మిగిలిన 16 సీట్ల‌లో కేవ‌లం ఆరు ఏడు సీట్ల‌ను మాత్ర‌మే సిట్టింగ్ ఎంపీల‌కు ఇచ్చిన కేసీఆర్ మిగిలిన 9 స్థానాల‌కు కొత్త వారినే ఎంపిక చేశారు. ఈ తొమ్మిది మందిలో ఐదుగురు కొత్త వారే కాగా... మిగిలిన న‌లుగురు కొత్తొళ్లు కాన‌ప్ప‌టికీ... టీడీపీ టికెట్ త‌ర‌ఫున కొత్త‌గా బ‌రిలోకి దిగుతున్న వారే.

ఇక ఎన్నిక‌ల‌కే కొత్త వారు ఎక్క‌డెక్క‌డి నుంచి పోటీ చేస్తున్నార‌న్న విష‌యానికి వ‌స్తే... రంజిత్ రెడ్డి (చేవెళ్ల‌) - మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి (మ‌ల్కాజిగిరి) - మ‌న్నె శ్రీ‌నివాస‌రెడ్డి (మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌) - వేమిరెడ్డి న‌ర‌సింహారెడ్డి (న‌ల్లొండ‌) - త‌ల‌సాని సాయి కిర‌ణ్ యాద‌వ్ (సికింద్రాబాద్‌)లు ఉన్నారు. వీరంతా రాజ‌కీయాల్లోకి కొత్త‌గా అరంగేట్రం చేస్తున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక రాజ‌కీయాల‌కు పాతొళ్లే అయిన‌ప్ప‌టికీ... టీఆర్ ఎస్‌ లో కొత్త అభ్యర్థులుగా ఉన్న వారిలో నామా నాగేశ్వ‌ర‌రావు (ఖ‌మ్మం) - పి. రాములు (నాగ‌ర్ క‌ర్నూల్‌) - వెంక‌టేశ్ నేతాని (పెద్ద‌ప‌ల్లి) - మాలోత్ క‌విత (మ‌హ‌బూబాబాద్‌)ల‌తో పాటు హైద‌రాబాద్ స్థానం నుంచి బ‌రిలోకి దిగిన పుస్తె శ్రీ‌కాంత్ కూడా టీఆర్ ఎస్‌ కు కొత్త ముఖ‌మే. కేసీఆర్ అనుస‌రిస్తున్న ఈ వ్యూహంపై కొన్ని వ‌ర్గాలు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అంటూ వ్యాఖ్య‌లు సంధిస్తుంటే.. మరికొన్ని వ‌ర్గాలు మాత్రం కొత్త ముఖాల‌ను బ‌రిలోకి దించ‌డంతో కేసీఆర్ న‌యా వ్యూహానికి తెర లేపార‌ని వ్యాఖ్యాస్తున్నాయి. చూద్దాం మ‌రి... కేసీఆర్ అనుస‌రిస్తున్న ఈ వ్యూహంతో టీఆర్ ఎస్ మేర‌కు ల‌బ్ధి ద‌క్కించుకుంటుందో?




Tags:    

Similar News