కోదండాన్ని క్లోజ్ గా ఫాలో అవుతున్న కేసీఆర్‌

Update: 2018-05-02 05:26 GMT
రాజ‌కీయ వ్యూహాల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆయ‌న వ్యూహ‌చ‌తుర‌త ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఆయ‌న న‌డిపిన ఉద్య‌మాన్ని చూస్తే ఇట్టే తెలుస్తుంది.

ఉద్య‌మాన్ని న‌డ‌ప‌టం ఒక ఎత్తు అయితే.. ఉద్య‌మంలో అంద‌రిని భాగ‌స్వామ్యం చేస్తూ.. ఉద్య‌మ ప‌గ్గాలు మాత్రం త‌న చేతుల్లో నుంచి పోకుండా ఉండేలా చేయ‌టంలో ఆయ‌న వ్యూహాలు ఎలా ఉంటాయో అంద‌రికి తెలిసిందే. ఉద్య‌మం మాత్ర‌మే కాదు..తెలంగాణ రాష్ట్రంలో  ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం.. మీడియాను ఎలా వాడుకోవాలో.. ఎప్పుడు ఎంత‌లా నియంత్రించాలో అన్న విష‌యంపై ఆయ‌న ప్రైవేటు క్లాసులు పెడితే.. రాజ‌కీయ అధినేత‌లు ప‌లువురు క్యూ క‌ట్ట‌టం ఖాయం.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా నిర్ణ‌యాలు తీసుకునే కేసీఆర్‌.. ఇటీవ‌ల రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన ఒక‌నాటి మిత్రుడు కోదండ‌రాం విష‌యంలో అలెర్ట్ గా ఉన్నార‌ని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోదండం మాష్టారికి ఉన్న పేరు ప్ర‌ఖ్యాతులు.. ఆయ‌న క్రెడిబులిటీ నేప‌థ్యంలో.. ఆయ‌న పార్టీ ఏర్పాటు మొద‌లు.. ఆయన కార్యాచ‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల నిర్వ‌హించిన పార్టీ స‌భ‌కు సంబంధించిన వివ‌రాలన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌ట‌మే కాదు.. ప‌లు విధాలుగా ఆయ‌న గ్రౌండ్ రిపోర్ట్ ను తెచ్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

సభ‌కు ఎంత‌మంది హాజ‌ర‌య్యారు. అందులో ఏయే వ‌ర్గాల వారు ఉన్నార‌న్న విష‌యాలు మొద‌లు.. స‌భ‌లో ఎవ‌రేం మాట్లాడారు.. దానికి స‌భికుల స్పంద‌న ఎలా ఉంద‌న్న విష‌యం పైనా ఆరా తీసిన‌ట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ను దెబ్బ తీసే అవ‌కాశం ఉన్న కోదండ‌రాంను తేలిగ్గా తీసుకోరాద‌ని.. ఆయ‌న క‌ద‌లిక‌ల‌పైన ప్ర‌త్యేక దృష్టి ఆస‌రించాల‌ని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. మాష్టారి మూమెంట్స్ మీద దృష్టి పెట్టి ప్ర‌తి క‌ద‌లిక‌కు సంబంధించిన స‌మాచారాన్ని త‌న‌కే నేరుగా అంద‌జేయాల‌ని ఆదేశించిన‌ట్లుగా స‌మాచారం. ఉద్య‌మంలో త‌న‌కొచ్చే పేరు ప్ర‌ఖ్యాతలకు మించిన ఇమేజ్ ను సొంతం చేసుకున్న కోదండం మాష్టార్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తే ఆయ‌న కేసీఆర్ ఎందుకు అవుతారు?
Tags:    

Similar News