ఆనందంలోనూ బాధ కేసీఆర్ కు మాత్ర‌మేన‌ట‌!

Update: 2019-05-20 01:30 GMT
మా పార్టీ అదిరిపోయే గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాను ప్ర‌తి ఒక్క రాజ‌కీయ పార్టీ అధినేత చెబుతారు. కానీ.. కొంద‌రు మాత్ర‌మే త‌మ మాట‌ల‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌జ‌ల చేత ఓట్లు వేయించుకోగ‌లుగుతారు. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ టాలెంట్ చాలా త‌క్కువ మంది అధినేత‌ల‌కు ఉంటుంద‌ని చెప్పాలి.  

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స్టార్టింగ్ నుంచి త‌మ పార్టీకి తిరుగులేద‌ని.. అత్య‌ధిక స్థానాల్లో గెలుపు ఖాయ‌మ‌న్న భ‌రోసాను వ్య‌క్తం చేస్తున్నారు.ఆయ‌న చెప్పిన‌ట్లుగా 16 సీట్లు రాకున్నా.. ఒకట్రెండు సీట్లు పోతే పోవ‌చ్చు కానీ.. 14 స్థానాల‌కు త‌గ్గే అవ‌కాశం లేద‌న్న‌ట్లుగా అత్య‌ధిక ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలో త‌న మిత్రుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంప‌ర్ మెజార్టీతో గెలుస్తార‌న్న అంచ‌నా ఏ మాత్రం త‌ప్పు కాలేద‌న్న విష‌యాన్ని తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తుంద‌ని.. పెద్ద ఎత్తున లోక్ స‌భ స్థానాల్ని సొంతం చేసుకుంటుంద‌న్న విష‌యాన్ని తాజా ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.

త‌న గెలుపుతో పాటు.. త‌న స్నేహితుడి గెలుపును ఇంత క‌చ్ఛితంగా అంచనా వేసిన కేసీఆర్‌.. కేంద్రంలో మోడీ స‌ర్కారు వ‌స్తుంద‌న్న విష‌యంలో త‌ప్పులో కాలేయ‌టం ఇప్పుడు ఆయ‌నకు ఇబ్బందిగా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేంద్రంలో బీజేపీ.. కాంగ్రెస్ ల‌కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేలా సీట్లు రాక‌పోవ‌చ్చ‌ని.. ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా అని.. వారే చ‌క్రం తిప్పుతార‌న్న అంచ‌నాలో కేసీఆర్ ఉన్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వాద‌న‌ను వినిపించ‌ట‌మే కాదు.. రానున్న రోజుల్లో తాను చ‌క్రం తిప్పుతాన‌న్న భ‌రోసాను వ్య‌క్తం చేశారు.

తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ మొత్తం మోడీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ కొలువు తీర‌నుంద‌న్న విష‌యాన్ని చెప్పేశాయి. ఏ ఒక్క మీడియా సంస్థ కానీ.. స‌ర్వే సంస్థ కానీ మోడీ ప్ర‌భుత్వం ప‌వ‌ర్లోకి వ‌చ్చే ఛాన్స్ లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఫెడ‌ర‌ల్ క‌ల‌లు క‌ల్ల‌లైన‌ట్లుగా చెప్పాలి.  మోడీ గెలుపు ఖాయ‌మ‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్న వేళ‌.. త‌న గెలుపు.. త‌న మిత్రుడి విజ‌యానికి సంబంధించి సంబ‌రాల్ని.. మోడీ గెలుపు మాట‌తో కేసీఆర్ చేసుకోలేని ప‌రిస్థితి. దేశంలో మ‌రే పార్టీ అధినేత‌కు ఎదురుకాని సిత్ర‌మైన ప‌రిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News