విమర్శలను బూమరాంగ్ చేసిన కేసీఆర్

Update: 2018-11-20 05:00 GMT
నిజాలు నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రజలను మెప్పించగలం.. వారి ఓట్లను పొందగలం.. సరిగ్గా కేసీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నారు. తన తప్పులను ఒప్పుకున్నాడు. కానీ తనకు అంత టైం లేకుండే అంటూ వివరణ ఇచ్చారు. ఇచ్చిన సమయంలో చేసిన అద్భుతాలను ఆవిష్కరించారు. ఆత్మావలోకనంకు మించిన అద్భుతమైన ఫలితం లేదంటారు.. ఇప్పుడు కేసీఆర్ కూడా తాను సాధించని పనులను ప్రజల ముందు ఉంచి వారికి అభివృద్ధి చట్రం చూపించి ఓట్లు అడిగిన విధానం ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది..

పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా ప్రతిపక్షాలన్ని కేసీఆర్ ను కార్నర్ చేయడానికి ఉన్న ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో డబుల్ బెడ్ రూం ఇళ్లు - దళితులకు మూడు ఎకరాల భూమి. నిన్న భట్టి విక్రమార్క కూడా ఇవే అస్త్రాలుగా కేసీఆర్ కు సంధించారు. కేసీఆర్ హామీ ఇవ్వని కళ్యాణ లక్ష్మి - రైతు బీమా - బంధు - లాంటి ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టి సాధించారు. కానీ ఇళ్లు, దళితులకు భూముల విషయంలో హామీని 100శాతం పూర్తి చేయలేకపోయారు.

అందుకే మలివిడత సభలో కేసీఆర్ ఎంతో ధైర్యంగా తాను చేయని పనులను ఒప్పుకొని ప్రజల ముందు ఉంచారు. దానికి గల కారణాలను కూడా వివరించిన తీరు ఆకట్టుకుంది. ‘దాదాపు 58 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ - టీడీపీ ఇన్నేళ్లలో ఏం చేశారు. నాలుగున్నరేళ్లలోనే సమస్యలన్నీ పరిష్కారం కావు కదా.. మేం ఏం చెడగొట్టలేదు.. ఎంతో సాధించాం.. ప్రజలు మా పథకాల గురించి ఆలోచించండి’ అంటూ తన లోటు పాట్లను అందుకు గల కారణాలను వివరించారు.

నిజానికి సమకాలీన రాజకీయాల్లో చేయని పనులను ఒప్పుకునే ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి లేదు. కానీ కేసీఆర్ ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సభల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కాంగ్రెస్ కట్టిన ఇందిరమ్మ ఇళ్లకంటే మెరుగని.. 100 శాతం ఉచితంగా ఇస్తున్నామని.. అందుకే ఎక్కువ కట్టలేకపోయామని సవివరంగా లెక్కలు వేసి మరీ జనాలకు వివరించారు. ఇక భూముల కొరతతో దళితులకు భూములు పంచలేకపోయామని తెలిపారు. ఇలా నిజాలను కూడా నిర్భయంగా ఒప్పుకొని అందులోనూ కాంగ్రెస్ పథకంతో పోల్చి కేసీఆర్ వివరించడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. ఏ విమర్శలనైతే కేసీఆర్ పై చేస్తున్నామో.. అవే విమర్శలకు కేసీఆర్ వివరణ ఇచ్చి కాంగ్రెస్ కంటే తామే ఎక్కువ చేశామని చెప్పడం విశేషం. మరి ఈ విమర్శలపై కాంగ్రెస్ ఇప్పుడు  ఏం సమాధానం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
    

Tags:    

Similar News