ప‌ది మందికి పైనే కేసీఆర్ టికెట్ షాక్ !

Update: 2018-08-27 04:09 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగుల‌కు టికెట్లు ఇస్తాన‌ని.. కాకుంటే తాను చేయించిన స‌ర్వేల్లో న‌లుగురైదుగురికి త‌ప్ప మిగిలిన వారంతా బ‌రిలో ఉంటార‌ని స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే. టికెట్లు రానోళ్ల‌కు ఎమ్మెల్సీ.. ఇత‌ర ప‌ద‌వులు ఇచ్చి క‌డుపులో పెట్టుకుంటామ‌న్న మాట‌ను చెప్పారు.

దీంతో.. టికెట్ల రాని వారు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న భ‌రోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం తీసుకునే నిర్ణ‌యాన్ని అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టికెట్లు వ‌చ్చే అవ‌కాశం లేని ఆ న‌లుగురైదుగురు ఎవ‌రు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తాను టికెట్ ఇవ్వ‌ని వారికి సంబంధించిన స‌మాచారాన్ని కేసీఆర్ ఇవ్వ‌ని నేప‌థ్యంలో.. టికెట్ విష‌యంలో మొండి చేయి ఎవ‌రికై ఉంటుంద‌న్న‌ది ఉత్కంటగా మారింది. 2014 ఎన్నిక‌ల్లో 63 స్థానాల్ని సొంతం చేసుకున్న కేసీఆర్‌.. త‌ర్వాతి కాలంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌తో పాటు.. ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలోకి తీసుకోవ‌టం ద్వారా బ‌లాన్ని 90కు చేరింది.

తాజాగా టికెట్లు రాని వారు న‌లుగురైదుగురు ఉంటార‌ని చెబుతున్న కేసీఆర్‌.. వారంతా మొద‌ట్నించిపార్టీలో ఉన్న వారా?  లేక‌.. బ‌య‌ట పార్టీల నుంచి వ‌చ్చిన వారా? అన్నది చ‌ర్చ‌గా మారింది.  దీనిపై ఎవ‌రి వాద‌న వారు వినిపిస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. టికెట్ల విష‌యంలో అధినేత చెప్పిన‌ట్లుగా న‌లుగురైదుగురితో ఆగిపోద‌ని.. ఆ సంఖ్య మరింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

టికెట్ల రాని సిట్టింగుల సంఖ్య ప‌దికి పైనే ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్రాధ‌మికంగా న‌లుగురైదుగురికి అని చెప్ప‌టం ద్వారా వ్య‌తిరేక‌త రాకుండా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని.. త‌ర్వాతి కాలంలో కాంబినేష‌న్లు.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు.. తాజాగా చేయించిన స‌ర్వేలు లాంటి వాటి పేరిట మ‌రికొంద‌రికి హ్యాండ్ ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. టికెట్లు రాని వారి నుంచి ఎదురుదాడి  త‌లెత్త‌కుండా చూసుకోవ‌టంతో పాటు.. అస‌మ్మ‌తి పెల్లుబిక‌కుండా ఉండ‌టం ద్వారా త‌న‌కు వ్య‌తిరేక గ‌ళం అన్న‌ది లేకుండా చేసుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి స‌మ‌స్యా లేకున్నా.. రానున్న రోజుల్లో ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అవుతుందా? అన్న అంశంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి.. అలాంటి ప‌రిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


Tags:    

Similar News