మొహమాటం లేకుండా కొత్తోళ్లకు వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్

Update: 2020-02-19 10:05 GMT
అధినేతలు చాలామంది ఉండొచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నం. ఆయనేం మాట్లాడినా సంచలనంc గా మారుతుంటుంది. ఆ మాట కంటే సంచలన వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వస్తాయంటే సరిపోతుందేమో? కొత్తగా ఎన్నికైన పురపాలక ప్రజా ప్రతినిధిులతో పాటు.. అధికారులకు కలిసి ప్రగతి భవన్ లో రాష్ట్రస్థాయి మునిసిపల్ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఎలా పాలన చేయాలో పాఠాలు చెప్పటంతో పాటు.. ఓవరాక్షన్ చేసే వారి విషయంలో ఉపేక్షించేది లేదని తేల్చేశారు. ‘‘డంబాచారాలు పలకొద్దు.. రాత్రికి రాత్రే అన్ని పనులూ చూస్తామని చెప్పొద్దు. పక్కా ప్లానింగ్ తో.. సమగ్ర కార్యాచరణ తో అందరిని కలుపుకు పోవాలి. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తగ్గించి.. పనుల మీద ఫోకస్ పెట్టండి.. అన్ని అనుకున్నట్లు సాగితే ఆర్నెల్లలో పట్టణాలు మంచి దారికి వస్తాయి’’ అంటూ స్పష్టం చేశారు.

మునిసిపాలిటీ అంటేనే మురికికి.. చెత్తకు పర్యాయపదంగా మారిందని.. అవినీతికి అడ్డాగా నిలిచిందని.. ఆ చెడ్డపేరు పోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇతర దేశాల విజయగాథల్ని వినటమే కాదు.. మనమూ విజయంసాధించాలన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు.

అధికారం.. హోదా వచ్చిన తర్వాత మనిషికి మారకూడదని.. లేని గొప్పతనాన్ని.. ఆడంబరాన్ని తెచ్చుకోవద్దన్న మాటను చెప్పిన ముఖ్యమంత్రి.. ఐదుకోట్ల మందిలో 140మందికే మేయర్లు.. చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని.. దాన్ని సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజాజీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చన్న మాటను చెప్పారు.

ఎన్నికల వరకే రాజకీయమని.. తర్వాత కాదన్న కేసీఆర్.. ఫోటోలకు ఫోజులు ఇచ్చే అంశం మీద ఫోకస్ ను తగ్గించి.. పనులు పూర్తి చేసే విషయం మీదనే దృష్టి పెట్టాలన్నారు. సుద్దులు చెబుతూనే.. చురకలు వేసిన సీఎం కేసీఆర్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News