తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి మంత్రులతో హై పవర్ కమిటీ !

Update: 2020-07-18 09:30 GMT
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ఈ కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ..తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కరోనా పై తెలంగాణ ప్రభుత్వం విఫలం అయింది అని విమర్శలు వస్తున్నాయి. అలాగే దేశంలో కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పై ‘లాన్సెట్’ అధ్యయనంలో తేలిన లెక్కలు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మధ్య కరోనా టెస్టుల సంఖ్యని పెంచిన ప్రభుత్వం తాజాగా న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వైద్యారోగ్య‌శాఖ‌లో ప‌నిచేస్తున్న కీల‌క అధికారుల‌పై వేటు వేసిన ప్ర‌భుత్వం… కొత్త అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష కూడా నిర్వ‌హించారు. క‌రోనా విష‌యంలో దేశంలోనే వెనుకబ‌డ్డ రాష్ట్రంగా విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో… రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, జిల్లాలకు మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు, చికిత్స అందించే సామ‌ర్థ్యం, టెస్టుల సంఖ్య‌ను పెంచేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్రైవేటు ఆసుప‌త్రులపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నింటిపై మంత్రులతో ఓ కమిటీ వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి ఈటెల రాజేంద‌ర్ నేతృత్వంలో మున్సిప‌ల్ మంత్రి కేటీఆర్, పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్ రావుతో పాటు మ‌రో ఇద్ద‌రు మంత్రులతో క‌లిసి కమిటీ వేయబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తో చర్చిస్తూ ఈ క‌మిటీ క‌రోనా మహమ్మారి అంశంలో ఎప్ప‌టిక‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల స‌మాచారం.
Tags:    

Similar News