వరాల దేవుడు బాదటం మొదలెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా?

Update: 2022-01-30 10:30 GMT
అడిగినంతనే వరాలు ఇస్తారని చెప్పలేం. ఆ మాటకు వస్తే.. కోరినంతనే దేవుడు ప్రత్యక్షమవుతాడా? అడిగినంతనే వరాలు ఇచ్చేస్తారా? దేవుడే చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తారా? ఏంటి? తనకు నచ్చిన వరాల్ని తనను కోరి ఎన్నుకున్న ప్రజలకు.. వారు కోరుకోకుండానే ఇచ్చే సిత్రమైన మైండ్ సెట్ గులాబీ బాస్ ది. రైతు బంధు ఎవరు అడిగారు? దళిత బంధు ఎవరు అడిగారు? ఏ ఎన్నికల ప్రణాళికలోనూ పెట్టకుండా.. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉండే ఈ పథకాలకు అవసరమైతే విత్తులు ఎక్కడి నుంచి వస్తాయి.

వరాల మాటున ఉండే శాపాల్ని మోయాల్సింది ప్రజలే. ఇదే విషయం తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మొన్నటికి మొన్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచేసిన కేసీఆర్.. ఆరేడు నెలలు కాక ముందే.. భూముల విలువను పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బాగా బలిసిన వాడి సంగతి పక్కన పెడితే.. బక్కజీవికి ఏదైనా రిజిస్ట్రేషన్ అన్నది మరింత భారంగా మారనుంది.

మార్చి ఒకటి నుంచి అమల్లోకి రానున్న స్థలాలు.. అపార్ట్ మెంట్ ప్లాట్ విలువల్ని భారీగా పెంచేసిన కేసీఆర్ సర్కారు ుణ్యమా అని.. ఇప్పటివరకు అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు మరింత పెరగనుంది. మరి.. ఈ నిర్ణయంతో ప్రజల వీపు మోత ఛార్జీల మోతమోగితే.. ప్రభుత్వానికి ఏమొస్తుందంటారా? ఏడాది ఏకంగా రూ.3వేల కోట్ల నుంచి రూ.3500 కోట్ల వరకు అదనపు రిజిస్ట్రేషన్ ఆదాయం రానుంది. ఇదంతా చూసినప్పుడు అడగకుండానే వరాలు ఇవ్వటం ఎందుకు? ఆ వరాల్ని తీర్చేందుకు అవసరమైన నిధుల కోసం ఏదో రూపేణా ఛార్జీలు పెంచటం ఎందుకు? ఆ భారం మొత్తం ప్రజల మీద మోపి.. సంక్షేమ పథకాల్ని అమలు చేయటం ఎందుకు? అన్న భావన కలుగక మానదు.

మిగిలిన ముఖ్యమంత్రులకు కేసీఆర్ కు కాస్తంత తేడా ఉంది. ఆయన అందరి మాదిరి రోటీన్ బాదుడు అస్సలు బాదరు. ఆయన ఏం చేసినా కూడా కాస్తంత భిన్నంగానే చేస్తారు. మిగిలిన వారి మాదిరి రోటీన్ గా పెంచే వాటిని వదిలేసి.. ఆస్తులు కొనుగోలు చేసే వారి మీద బాదటం ద్వారా తెలివిగా వ్యవహరిస్తారని చెప్పక తప్పదు. రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవటానికి స్థలాలు.. ప్లాట్ల విలువను పెంచిన నిర్ణయం ప్రజలందరికి భారమే అయినా.. మనమేం కొనం కదా? కొనేవారికి కదా? అంటూ అత్యధికులు ఫీలయ్యేలా చేస్తారు. కానీ.. కొనేవారికి ఎంత భారమన్నది తమ వరకు వచ్చాక కానీ తెలియని పరిస్థితి. అయినా.. వరాల దేవుడు వరాలు ఇవ్వాలే కానీ ఇలా బాదేయటం ఏమిటి చెప్మా?
Tags:    

Similar News