కొలువుల‌తో ఆ కొర‌త తీర్చ‌నున్న కేసీఆర్‌

Update: 2017-06-18 03:54 GMT
కీల‌క నిర్ణ‌యాల్ని ప్ర‌క‌టించారు తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటుతున్నా.. నిరుద్యోగ యువ‌త విష‌యంలో కేసీఆర్ చేసిందేమీ లేద‌న్న విమ‌ర్శ ఒక‌టి ఉంది. దానికి చెక్ పెట్టేలా ఆయ‌న తాజాగా నిర్ణ‌యాలు తీసుకున్నారు. మూడున్న‌ర గంట‌ల పాటు సాగిన తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశంలో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 30 వేల ఉద్యోగాల‌కు సంబంధించిన నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇందులో పోలీసు ఉద్యోగ నియామ‌కాల కోసం 26,290 పోస్టుల‌ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. మూడేళ్ల వ్య‌వ‌ధిలో వీటిని భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తించింది. తాజాగా ప్ర‌క‌టించిన పోలీసు ఉద్యోగాల్లో 8 వేలు ఖాళీల్ని భ‌ర్తీ చేస్తుండ‌గా.. 18,290 పోస్టులు కొత్త‌వి కావ‌టం గ‌మ‌నార్హం.

మరో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ 26వేల పోస్టులు ఇప్ప‌టికిప్పుడు భ‌ర్తీ కావు. రానున్న మూడేళ్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేస్తారు. అంటే.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గా చెప్పొచ్చన్న అభిప్రాయం ఉంది. తాజాగా పేర్కొన్న భ‌ర్తీ ఎన్నిక‌ల ఏడాదిలో భారీగా ఉండే అవ‌కాశం ఉంద‌ని.. దీంతో యూత్ లో ప్ర‌భుత్వంపై సానుకూల భావ‌న పెరిగేలా తాజా నిర్ణ‌యం వెనుక వ్యూహం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

పోలీసు నియామ‌కాల‌తో పాటు రెవెన్యూ విభాగంలోనూ 2506 పోస్టుల్ని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో వివిధ విభాగాల‌కు భ‌ర్తీ చేయ‌నున్నారు. పోలీసు నియామ‌కాల్లో కానిస్టేబుల్‌.. ఎస్సై.. సీఐ.. డీఎస్పీ పోస్టులు ఉండ‌నున్నాయి. ఇక‌.. రెవెన్యూ పోస్టుల భ‌ర్తీలో   సీసీఎల్‌ ఏ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌(21).. డిప్యూటీ కలెక్టర్‌(8).. డిప్యూటీ తహసీల్దార్‌(58).. జూనియర్‌ అసిస్టెంట్లు/టైపిస్టు(400).. వీఆర్వో(700).. వీఆర్‌ ఏ(1,000).. డిప్యూటీ సర్వేయర్‌(100).. కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌ మెన్‌(50).. జిల్లా రిజిస్ట్రార్‌(7).. సబ్‌ రిజిస్ట్రార్‌(22).. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌(50).. సర్వేయర్‌(100) చొప్పున పోస్టులున్నాయి.

ఉద్యోగ నియామ‌కాల‌తో పాటు.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న జోన‌ల్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు 371(డి) ద్వారా జిల్లా.. రాష్ట్ర కేడ‌ర్లు ఉండేవి. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఉద్యోగ‌.. ఉపాధ్యాయ సంఘాల‌తో చ‌ర్చించామ‌ని.. జోన‌ల్ వ్య‌వ‌స్థ వ‌ద్ద‌ని కోరార‌న్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లా.. రాష్ట్ర క్యాడ‌ర్లు ఉండేలా మంత్రివ‌ర్గం తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌వేళ దీనిపై ఏమైనా స‌ల‌హాలుఉంటే ఎస్పీ సింగ్ అధ్య‌క్షత‌న ఏర్పాటైన క‌మిటీకి సూచ‌న‌లు ఇవ్వొచ్చ‌ని చెబుతున్నారు.

స‌మావేశంలోనూ.. విడిగా తీసుకున్న మ‌రిన్నికీల‌క నిర్ణ‌యాలు

+ ప్ర‌స్తుతం ర‌హ‌దారుల అభివృద్ధి సంస్థ‌కు రూ.వెయ్యి కోట్ల రుణ‌ప‌రిమితికే ప్ర‌భుత్వ పూచీక‌త్తు ఉండేది. రుణ ప‌రిమితిని రూ.5వేల కోట్ల‌కు పెంచటం

+  రైతుల స‌మ‌గ్ర‌స‌ర్వేలో ఇప్ప‌టివ‌ర‌కూ పేర్లు న‌మోదు చేసుకోని వారు వెంట‌నే త‌మ పేర్లు.. భూముల వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి

+ యాసంగిలో 39 ల‌క్ష‌ల ట‌న్నులకు పైగా ధ్యానం కొనుగోలుకు నిర్ణ‌యం

+  ఈ నెల 20 నుంచి  గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని షురూ చేస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని సీఎం కేఈఆర్  గ‌జ్వేల్‌లో షురూ చేస్తారు. వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు.. ఎంపీలు..ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారు.

+ జులై నుంచి సంచార ప‌శు వైద్య‌శాల‌ల్ని ప్రారంభించ‌టం. ఈ త‌ర‌హా దేశంలోనే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం.

+  24 వేల చెరువుల్లో 70 కోట్ల చేప‌ల పంప‌కం. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి చేవ‌ల ద్వారా వ‌చ్చే ఆదాయంలో వాటా.

+ జులై నుంచి హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా 40 కోట్ల మొక్క‌లు నాటాల‌న్న నిర్ణ‌యం

+ అక్టోబ‌రు 22 నుంచి వారం పాటు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్ని నిర్వ‌హించాలి

+ దేవాల‌యాల అర్చ‌కులు.. ఉద్యోగుల‌కు ప్ర‌తి నెలా బ్యాంకుల్లో వేత‌నాల జ‌మ‌

+ క‌ల్తీలు.. న‌కిలీల‌కు చెక్ పెట్టేలా పీడీ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ నిర్ణ‌యం. క‌ల్తీ విత్త‌నాలు.. ఎరువులు.. పురుగు మందులు.. ఆహారం.. పాలు.. నూనె.. కారం.. ప‌సుపు అమ్మే వారు. ప్ర‌జా పంపిణీ బియ్యం అక్ర‌మ ర‌వాణాదారులు.. అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌దారులు.. న‌కిలీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలున్న వారు.. మందుగుండు సామాగ్రి అక్ర‌మ వ్యాపారులు.. లైంగిక దాడుల‌కుపాల్ప‌డేవారు.. సైబ‌ర్‌.. వైట్ కాల‌ర్‌.. గేమింగ్‌.. గ్యాంబ్లింగ్ నేర‌గాళ్లూ పీడీ యాక్ట్ లోకి వ‌చ్చేలా నిర్ణ‌యం

+ ఆన్ లైన్ జూదం.. ర‌మ్మీ గేమింగ్‌.. గ్యాంబ్లింగుపై నిషేధం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News