అభ్యంతరాల గురించి లైట్ అన్నారట

Update: 2016-09-07 05:05 GMT
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు మహా జోరుగా ముందుకెళుతోంది. దసరా రోజున కొత్త జిల్లాల్ని ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్లే దూసుకెళుతున్నారు. ఓపక్క కొత్త జిల్లాలకు సంబంధించి ధర్నాలు.. నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా వాటిపై దృష్టి పెట్టని ఆయన దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ ముఖ్యాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన కేసీఆర్ వైఖరి చూస్తే స్పష్టమయ్యేది ఒక్కటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా రోజు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి కావటమే కాదు.. అదే రోజు నుంచి పాలన షురూ కావాలనే. కొత్త జిల్లాల ఏర్పాటును ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారే చందంగా అభివర్ణిస్తున్న కేసీఆర్.. ఆ తరహా సమస్యలే ఎదురవుతాయన్న విషయాన్ని మర్చిపోకూడదనటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త జిల్లాలుగా గద్వాల్.. పరకాల జిల్లా ఏర్పాటు గురించి కించిత్ కూడా ఆలోచించని కేసీఆర్.. వేల కొద్దీ వస్తున్న అభ్యంతరాలు.. సూచనల విషయం మీద కూడా దృష్టి సారించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వచ్చిన వేలాది అభ్యంతరాలు.. వినతుల స్వరూపం ఏమిటి? వాటికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి? వేటిని ఆమోదిస్తున్నారు? వేటిని తిరస్కరిస్తున్నారు? ఎందుకు? ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి. తెర మీదకు వచ్చిన వేలాది అభ్యంతరాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. గద్వాల్ మీద వచ్చిన 8వేలకు పైచిలుకు అభ్యంతరాల్లో 6వేల అభ్యంతరాలు ఒకే వ్యక్తి సంతకంతో వచ్చాయంటూ వాటిని లైట్ అనేయటం గమనార్హం.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వచ్చిన వినతులు.. అభ్యంతరాల్ని వదిలేసినట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు భిన్నంగా దసరా రోజు నుంచి పాలన షురూ కావాలని.. అన్ని శాఖలు అదేరోజు నుంచి పని చేయటం మొదలెట్టాలని.. పాలనకు తగ్గట్లుగా ఉద్యోగుల కూర్పు ఉండాలన్న అంశాల మీదనే ముఖ్యమంత్రి దృష్టి ఉండటం గమనార్హం. కొత్తగా ఏర్పడే జిల్లాలతోపాటు.. ఇప్పటికే ఉన్న జిల్లాల్లో అధికారులు.. శాఖల ఏర్పాటు ఎలా ఉండాలన్నఅంశంపై కేసీఆర్ ఒక స్పష్టత ఇవ్వటం కనిపిస్తోంది. ఏ జిల్లా అయినా ఆ జిల్లా స్వరూప స్వభావాలకు అనుగుణంగా శాఖల ఏర్పాటు ఉండాలంటున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల్లో పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కోసం రూ.కోటి.. జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు రూ.50లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారు. అభ్యంతరాల కంటే కూడా ఆనందోత్సాహాల మధ్య కొత్త జిల్లాలు ఎలా షురూ కావాలన్న అంశం మీదనే కేసీఆర్ ఫోకస్ అంతా ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. దీన్ని తప్పు పట్టలేం కానీ.. కొత్త జిల్లాలపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతే సీరియస్ నెస్ చూపిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
Tags:    

Similar News