కూతురు మాట‌తో కేసీఆర్ కొత్త ప‌థ‌కం

Update: 2018-02-10 06:40 GMT
రాజు త‌లుచుకుంటే వ‌రాల‌కు కొద‌వా? అందునా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి  నేత ద‌గ్గ‌ర‌కు న్యాయ‌స‌మ్మ‌తంగా ఉన్న స‌మ‌స్య‌ను తీసుకొస్తే స్పందించ‌కుండా ఉంటారా? అందులోకి తీసుకొచ్చింది స్వ‌యంగా కుమార్తె అయిన‌ప్పుడు రియాక్ష‌న్ ఎంత‌లా ఉంటుంద‌న‌టానికి కేసీఆర్ ప్ర‌క‌టించిన తాజా ప‌థ‌క‌మే నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి బోద‌కాలతో బాధ ప‌డే వారికి ప్ర‌తి నెలా వెయ్యి రూపాయిలు పింఛ‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. రాబోయే బ‌డ్జెట్ లో ఇందుకు సంబంధించిన నిధుల్ని కేటాయించ‌నున్నారు. ఇదే విష‌యాన్ని కేసీఆర్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

బోద‌కాల‌తో బాధ ప‌డే వారి స‌మ‌స్య‌ల్ని సీఎం కేసీఆర్ కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత‌.. తండ్రి దృష్టికి తీసుకెళ్లారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంతో పాటు.. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బోద‌కాల‌తో బాధ ప‌డే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని.. ఇలాంటి వారు అడుగు తీసి అడుగు వేయాలంటే తీవ్ర ఇబ్బందికి గురి అవుతుంటార‌ని.. అలాంటి వారికి నెల‌స‌రి పెన్ష‌న్ ఇస్తే ఎంతో సంతోషిస్తార‌ని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 46,476 మంది బోద‌కాల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు సీఎం దృష్టికి ఆమె తీసుకొచ్చారు. త‌మ సొంత జిల్లాలోనూ ఈ వ్యాధితో ఇబ్బంది ప‌డే వారు ఎక్కువ‌గా ఉన్న విష‌యాన్ని మంత్రి తుమ్మ‌ల ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌న్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్య‌క్తం చేశారు.

ఆర్థిక స్తోమ‌త ఉన్న వారు.. ఈ వ్యాధిని మొదట్లో గుర్తించేలా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నార‌ని.. గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన వారు మాత్రం టెస్టులు చేయించుకోలేక‌పోతున్న విష‌యాన్ని  సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం ఒక యూనిట్ గా చేసుకొని ప్ర‌జ‌లంద‌రికి ప్ర‌భుత్వ ఖ‌ర్చుతోనే బోద‌కాల రోగ నిర్దార‌ణ టెస్టులు చేయించాల‌ని నిర్ణ‌యించారు. ఏమైనా.. త‌న తాజా ప‌థ‌కంతో కూతురు క‌విత‌కు మాత్ర‌మే కాదు.. వేలాది మంది ముఖాల్లో కేసీఆర్ సంతోషంతో వెలిగిపోయేలా చేశార‌ని చెప్పాలి.

Tags:    

Similar News