మునిగిన మార్కెట్‌..మనకేమొస్తుంది సారూ!

Update: 2015-09-11 06:10 GMT
చైనాలో ఈ ఏడాది వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరిగినదంటే.. దాని అర్థం.. ఆ వేదిక ఏడాదికి ముందే ఖరారైపోయి ఉంటుంది. కానీ ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ విషయం చైనా పర్యటనకు వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఆయన అందుకే ఫోరం సదస్సుకోసం రూపొందించుకున్న తన ప్రసంగపాఠంలో చైనా ఆర్థిక పరిస్థితి మీద జాలి ని కూడా కలిపి రాసుకున్నారు. అలాగే చైనాను కాస్త ఎంకరేజి చేసే విధంగా మీ పరిస్థితి బాగుపడుతుంది లెమ్మంటూ.. మంచిరోజులు ముందున్నాయనే మాటలు కూడా జతచేసి కేసీఆర్‌ ప్రసంగాన్ని తీసుకువెళ్లారు. అయితే చైనా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం కుదేలైపోయి ఉన్న సమయంలో అక్కడి పారిశ్రామిక వేత్తలనుంచి లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా యాత్రకు వెళ్తున్నామని చెప్పడమే విస్మయపరుస్తోంది.

ఎకనామిక్‌ ఫోరం సదస్సు వేదిక మీదనుంచి తమ రాష్ట్రానికి వస్తే.. భారీ రాయితీలు ఉంటాయంటూ కేసీఆర్‌ ప్రకటించారు. నిజానికి ఫోరంనుకూడా వచ్చే ఏడాది సదస్సును మా హైదరాబాదులోనే నిర్వహించుకోండి అంటూ ఒక ఆఫర్‌ ఇచ్చారు. తెలంగాణ అమలు చేస్తున్న కొత్త పారిశ్రామిక విధానంలోని సరికొత్త అంశాలన్నిటినీ కూడా ఆయన అక్కడి పారిశ్రామికవేత్తలకు నివేదించారు. గ్రిల్స్‌ లేని సింగిల్‌ విండో విధానం తమ రాష్ట్రంలో ఉన్నదంటూ చతుర్లు వేశారు.

అంతా బాగానే ఉంది. కానీ పెట్టుబడులు వస్తాయా అనే విషయంలోనే ఆర్థిక నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా పారిశ్రామికవేత్తలనుంచి అయితే పెట్టుబడులు రావడం అసాధ్యం అనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఇతర ప్రపంచ దేశాల వారిలో ఎవరైనా ఆయన మాటల పట్ల ఆకర్షితులు అయితే కావొచ్చు గానీ. చైనాకు సంబంధించినంత వరకు పెట్టుబడులు.. అనేవి.. ఇక్కడ పరిశ్రమలు ప్రారంభం అయ్యేవరకు నమ్మడానికి వీల్లేదని పలువురు అంచనా వేస్తున్నారు. నిజానికి కేసీఆర్‌ షాంఘై ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తో కూడా భేటీ అయ్యారు.

పంపులు, ఎలక్ట్రిక్‌ సామాన్ల తయారీ యూనిట్‌ ను తెలంగాణలో పెట్టేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు గానీ.. నిజానికి ఇది పెద్ద విజయం కాదు. పైగా ఇలాంటి సంసిద్ధతలు ఇదివరలో కూడా అనేకం జరిగాయి. వారు రాష్ట్రానికి రావడం పరిస్థితుల్ని పరిశీలించడం కూడా జరుగుతోంది. ఆ తర్వాత వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా తిరిగి కోలుకునే వరకు అక్కడి నుంచి మనకు పెట్టుబడులు అసాధ్యం అనే పలువురు అంటున్నారు.
Tags:    

Similar News