#ThankYouPK : అండ్ ద క్రెడిట్ గోస్ టు..జేజేలు కేసీఆర్

Update: 2022-03-09 12:31 GMT
నీళ్లూ నిధులూ నియామ‌కాలు అనే మూడు అంశాలే ప్రాతిప‌దిక‌న జ‌రిగిన ఆ రోజు ఉద్య‌మాన్ని మ‌రువ‌లేం. తెలంగాణ వాకిట గొప్ప స్ఫూర్తి ఆ ఉద్యమం. ఆ మాట‌కు వ‌స్తే ఇవాళ్టికీ ఆంధ్రాలో కూడా కొన్ని ఉద్య‌మాల‌కు రిఫ‌రెన్స్ కోడ్ అది.

అందుకే ఉద్య‌మ స్ఫూర్తిని కొన‌సాగిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.తెలంగాణ వాకిట త‌ల్లులంతా ఆనందాలు వ్య‌క్తం చేస్తూ  ఇంటి పెద్ద రుణం తీర్చుకోలేమ‌ని కేసీఆర్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్య ఒక‌టి వారి ఉద్వేగ ప్ర‌తీక.

ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లో 90వేల‌కు పైగా పోస్టులు  భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని చెప్పారు.ఈ అనూహ్య ప్ర‌క‌ట‌న‌తో అటు విప‌క్షాలు కూడా డైలమాలో పడిపోయాయి.ఒక‌టో రెండో విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా అవేవీ లెక్క‌లో లేకుండా పోయాయి.

అంతేకాదు కేసీఆర్ ను విప‌క్షం నుంచి కొంద‌రు మెచ్చుకుంటున్నారు.ఇదే స‌మ‌యంలో ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహం కార‌ణంగానే కేసీఆర్ ఇవాళ ఇంతటి సాహ‌సోపేత‌మ‌యిన చ‌ర్య తీసుకున్నార‌ని ఇంకొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు.

#ThankYouPK  పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ట్రెండ్ ఇన్ చేస్తున్నారు.ప్ర‌శాంత్ కిశోర్ ఇటీవ‌ల కాలంలో  తెలంగాణ‌లో చేప‌ట్టిన స‌ర్వే కార‌ణంగానే ఇంత‌టి మంచి నిర్ణ‌యం ఒక‌టి కేసీఆర్ తీసుకున్నార‌ని,ఇది రాష్ట్ర రాజ‌కీయాల‌నే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల ప‌రిణామాలనే కాదు యావ‌త్ జాతినే ప్ర‌భావితం చేయ‌గ‌ల‌ద‌ని విశ్వ‌సిస్తున్నారు కేసీఆర్ ను అభిమానించే  కొంద‌రు విద్యార్థులు మ‌రియు నిరుద్యోగులు కూడా!

ఇదే స‌మ‌యంలో ఎప్పుడూ నిర‌స‌న‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోయే ఓయూలో ఇవాళ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.అసెంబ్లీలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న ఇంకా పూర్తి కాకుండానే జ‌స్ట్ ఒక్క మాట ఆయ‌న నుంచి సానుకూలంగా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి రావ‌డంతోనే అంతా అల‌ర్ట్ అయి ఆయ‌న‌కు జేజేలు కొట్టారు.

ఎన్నాళ్లో వేచిన ఉద‌యం రానే వ‌చ్చిందంటూ సంబ‌రాలు చేసుకున్నారు.ఇదే వేగంతో ఇదే స్ఫూర్తితో ఇచ్చిన మాట నిలుపుకుంటే కేసీఆర్ కు ఇక తిరుగే ఉండ‌ద‌ని, తెలంగాణ నేల‌పై ఆయ‌న‌కు ఎదురు అన్న‌దే ఉండ‌ద‌ని ఓయూ విద్యార్థులు ఆనందోత్సాహాల‌తో అంటున్న మాట.
Tags:    

Similar News