వరుస పెట్టి తీపికబుర్లు చెబుతున్నకేసీఆర్

Update: 2023-06-20 10:13 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కీసీఆర్ లో ఒక సిత్రమైన అధినేత ఉంటారు. అప్పటివరకు కామ్ గా.. ఎలాంటి చలనం లేనట్లుగా.. అసలేం జరిగినా స్పందించనట్లుగాఉంటారు కొంతకాలం పాటు. అలాంటి ఆయన.. ఒక్కసారి గా ఉలిక్కిపడి లేచినట్లుగా వ్యవహరిస్తూ.. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఫేజ్ లోనే గులాబీ బాస్ ఉన్నారు. ఎన్నికలు మరో నాలుగు నెలల్లోకి వచ్చే వేళలో.. వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకాలం పెండింగ్ అంశాల్ని క్లియర్ చేసేలా ఆయన తీరు ఉంది. గడిచిన 48 గంటల్లో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అందులో మొదటిది తెలంగాణ రైతాంగాని కి వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధుల ను ఈ నెల 26 నుంచి విడుదల చేయాల ని డిసైడ్ చేశారు. ఎప్పటి లానే రాష్ట్ర రైతాంగాని కి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఈ నిధుల ను జమ చేయాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాల ని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బాధ్యత ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ కు అప్పజెప్పారు. అంతేకాదు.. పోడు భూముల కు పట్టాల పంపిణీ అనంతరం పట్టాలు పొందిన రైతుల కు సైతం రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో 60 లక్షల మంది రైతుల కు రైతుబంధు మొత్తం జమ కానుంది.

ఇదిలా ఉంటే.. మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును చెప్పేసింది. కనీస వేతనం.. పెన్షన్ పై 2.73 శాతం డీఏ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో 7.28 లక్షల మంది ఉద్యోగుల కు లబ్థి చేకూరనుంది. అంతేకాదు.. పెంచిన కరువు భత్యం జూన్ నెల జీతం నుంచి చెల్లించనున్నారు. దీంతో.. దీని ప్రయోజనం.. వచ్చే నెల జీతంలో రానుంది.

ఏళ్లుగా ఎదురుచూస్తున్న మరో కీలక ప్రకటన కేసీఆర్ సర్కారు నుంచి వెలువడనుంది. అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. అనధికారికంగా మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం లో.. రికార్డుస్థాయిలో నిర్మించిన కొల్లూరు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేయాల ని డిసైడ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో 125 ఎకరాల్లో 15,600 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించటం తెలిసిందే. ఈ ఇళ్లను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఆరుగురు లబ్థిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు అందించనున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభం తర్వాత పటాన్ చెర్వులో 200 పడకల తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దాదాపు రూ.1500 కోట్ల (కరెక్టుగా చెప్పాలంటే 1474.75 కోట్లు)తో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సుదీర్ఘ కాలంగా పంపిణీ చేయకుండా అట్టే ఉంచేశారు. ఇంతకాలం ఊరించిన ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని హటాత్తుగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇలా ఒకటి తర్వాత ఒకటన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తుంటే.. కేసీఆర్ లోని వరాల దేవుడు మళ్లీ నిద్ర లేచినట్లుగా చెప్పక తప్పదు.

Similar News