కేసీఆర్ బాహుబలి అంటారు.. కట్టప్పలు చాలామందే

Update: 2019-10-18 10:30 GMT
ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. సరిగ్గా ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. మర్యాదస్తుడిగా ఉంటూ.. మొహమాటంగా మాట్లాడే ఆయన్ను పార్టీలకు అతీతంగా అభిమానిస్తుంటారు. అలాంటి ఆయన ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తారు. రెండోసారి కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి ఆయన నోటి నుంచి వచ్చే మాటల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీశాయి.
తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు టీఆర్ఎస్ బాస్ నుంచి నేతల వరకూ షాకింగ్ గా మారాయి. టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకోవటానికి మాట్లాడే మాటలతోనే వారికి పంచ్ లు ఇవ్వటం లక్ష్మణ్ కు అలవాటు. తమ వద్ద బాహుబలి లాంటి కేసీఆర్ ఉన్నారంటూ టీఆర్ఎస్ నేతలు చేసే వ్యాఖ్యలకు దిమ్మ తిరిగిపోయే రీతిలో.. అవును బాహుబలి ఉన్నారు.. ఆ పార్టీలో బోలెడంతమంది కట్టప్పలు ఉన్నారంటూ చురుకు పుట్టించి..కొత్త సందేహాంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా వ్యాఖ్యలు చేశారు.

తాను చేసిన వ్యాఖ్యలేమీ ఉత్తగా చేస్తున్నవి కాదని.. ఆర్టీసీ సమ్మె వెనుక తమ పార్టీకి చెందినోళ్లుచాలామంది ఉన్టన్లుగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్న మాటల్ని ప్రస్తావించి మరీ పంచ్ విసిరారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్నారని చెప్పారు. సొంతపార్టీ నేతలే కాదు.. రాష్ట్రంలోని వివిధ వర్గాల వారు కేసీఆర్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు. ఈ కారణంతోనే టీఆర్ఎస్ నేతు ఉస్మానియా.. కాకతీయ వర్సిటీల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉందన్నారు.

ఆర్టీసీ సమ్మెను తాము ఎగదోస్తున్నామన్న విమర్శలపై లక్ష్మణ్ తీవ్రంగా స్పందిస్తూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో తలగోక్కున్నట్లేనని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించిన వైనాన్ని గుర్తు చేశారు. మరి.. ఆయన కూడా ఉద్యమ సమయంలో వారిని ఎగదోసిండా? అని ప్రశ్నించిన లక్ష్మణ్.. తెలంగాణ ద్రోహులంతా ఇప్పుడు మంత్రులయ్యారని.. ఒకప్పుడు ఉద్యమంలో పాల్గొనని వారంతా మంత్రులై మాట్లాడుతున్నారని.. వారిని ఎలా సహిస్తామని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆడింది డ్రామానే అయితే.. ఇప్పుడు తాము ఆడేది కూడా డ్రామానే అంటూ మాట్లాడిన లక్ష్మణ్ కామెంట్స్ కు తెలంగాణ అధికారపక్షం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News