మోడీతో అంత వీజీనా... ?

Update: 2021-12-15 13:30 GMT
మోడీ పరిపాలన గురించి చెప్పాలి. మార్కులు వేయాలీ అంటే ఎవరైనా కాస్తా ఆలోచిస్తారు కానీ ఆయన రాజకీయ వ్యూహాలు, చతురత మీద ప్రశ్న అడిగితే మాత్రం ఠక్కున చెప్పేస్తారు. మోడీ గండరగండడు. ఒక్క ముక్కలో చెప్పాలీ అంటే ఆయన అపర చాణక్యుడు అని చెబుతారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పదమూడేళ్ళు పనిచేసినా ఏ రోజు ఆ రాష్ట్రం దాటి బయటకు రాని మోడీ, ఢిల్లీలో కూడా పెద్దగా సందడి చేయని మోడీ అటునుంచి అటే జాతీయ రాజకీయాల్లోకి అలా క్యాక్ వాక్ చేసుకుని  వచ్చి పెద్ద కుర్చీ ఎక్కేశారు.

అప్పటికి ఫుల్ మెజారిటీ మాట దేముడెరుగు రెండు వందల సీట్లు రావడమే ఏ పార్టీకైనా కష్టం అనుకుంటున్న నేపధ్యంలో  ఏకంగా ఒకే ఒక చాన్స్ తో ఫుల్ మెజారిటీ సాధించేశారు. ఇక రెండవ మారు కూడా అంతకు మించి అన్నట్లుగా 300 సీట్లకు దాటేశారు. ఇక ముచ్చటగా మూడవ విడత కూడా గెలిచి ప్రధాని అయితే గాంధీల రికార్డుని అధిగమిస్తారు.

మరి అలాంటి అవకాశాన్ని మోడీ వదులుకుంటారా. ఎన్నికలకు కరెక్ట్ గా చూస్తే రెండున్నరేళ్ళ సమయం మాత్రమే ఉంది. ఈ రోజుకీ మోడీని ఢీ కొట్టే నాయకత్వం ఎక్కడా దేశాన ఏ కోశానా కనిపించడంలేదు. కాంగ్రెస్ ఏమో సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతోంది. టెంపరరీ ప్రెసిడెంట్ గానే  సోనియా గాంధీ గత రెండున్నరేళ్ళుగా నాయకత్వం వహిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఉండాల్సింది తన మీద తనకు  నమ్మకం, కానీ అతిశయం, అహంకారం ఆయనలో ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు.

పైగా ఆయన మోడీని టార్గెట్ చేయడమే తప్ప కాంగ్రెస్ ని ఏడున్నరేళ్ళుగా ఎక్కడా బలోపేతం చేసే పనిని చేపట్టలేదని విమర్శలు ఉన్నాయి. మరి దేశంలో ఆసేతు హిమాచలం తెలిసిన కాంగ్రెస్ పార్టీకే మోడీ కొరకరాని కొయ్యగా మారిన నేపధ్యంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తలో చోటా తమ పని తాము చేసుకునే ఫక్తు  ప్రాంతీయ పార్టీలకు మోడీని దించడం సాధ్యమవుతుందా.

చిత్రమేంటి అంటే తమ రాష్ట్రం దాటితే ఈ నాయకులకు బయట పెద్దగా ఆదరణ లేదు. మూడు సార్లు పశ్చిమ బెంగాల్ లో గెలిచేశాను కాబట్టి ఇక మోడీ కుర్చీ ఖాళీ చేయాల్సిందే అంటున్నారు మమతా బెనర్జీ. ఆమె తరచూ ఢిల్లీ వస్తూ విపక్ష నేతలను కలుస్తూ మోడీకి తానే ఆల్టర్నేషన్ అంటున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది అంటూనే ఆ పార్టీకి ఏమైనా  కోరిక ఉంటే తమతో జట్టు కట్టవచ్చు అంటూ శతాధిక వృద్ధ పార్టీనే ర్యాగింగ్ చేస్తున్నారు మమత.

ఇపుడు సౌత్ లో చూసుకుంటే టీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ వంతు. ఆయన తమిళనాడు వెళ్లి భక్తి ముక్తీ, అన్నట్లుగా ఆలయాల సందర్శనతో పాటుగా డీఎంకే అధినేత స్టాలిన్ ని కూడా కలిశారు. ఆయన‌తో ముచ్చట్లు పెట్టారు. కేంద్రంపై కలసి యుద్ధం చేద్దామని చెప్పినట్లుగా భోగట్టా.

ఇక స్టాలిన్ యూపీయే కూటమిలో ఉన్నారు. ఆయన రాహుల్ కి బాగా ఇష్టుడు. పైగా స్టాలిన్ కి దేశ రాజకీయాలు ముఖ్యం కాదు, కాంగ్రెస్ కూటమిని వీడాల్సిన అవసరం లేదు. దాంతో ఆయన ఎలా రియాక్ట్ అవుతారో పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరంలేదు. ఇంతకీ కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ ని బయటకు తీస్తున్నారా లేక మమత కూటమికి యాంటీగా పనిచేస్తున్నారా అన్నది కూడా తెలియదు.

ఏది ఏమైనా కూడా అటు మమత కానీ ఇటు కేసీయార్ కానీ మోడీని ఢీ కొడతామని అంటున్నారు. వారి ఉత్సాహానికి శభాష్ అనాల్సి ఉన్నా వారి పరిధులు పరిమితులు చూస్తే మాత్రం చేస్తున్నదేంటి అనిపించకమానదు. ఈ రోజుకైనా దేశంలో బీజేపీయే బలంగా ఉంది. ఆ పార్టీని దించాలి అంటే కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రాంతీయ పార్టీలు అన్నీ కలసి  వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో. అంతే కానీ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటూ మొత్తం 27 రాష్ట్రాలూ కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అంతటా తమకే బలం ఉందని ఊహించుకుని ఏ నేత అయినా  హుషార్ చేస్తే కష్టమే మరి. మొత్తానికి మోడీతో ఎవరికీ వీజీ మాత్రం కాదనే చెప్పాలి.
Tags:    

Similar News