ఢిల్లీలో మోడీతో ఢీ : కేసీయార్ జాతీయ వ్యూహం

Update: 2022-07-15 09:30 GMT
కేసీయార్ పట్టుదలకు మారుపేరు. సాధ్యాసాధ్యాలను ఆయన తరువాత ఆలొచిస్తారు. ముందు తాను అనుకున్నది చేయడానికి వెనకాడరు. అందుకే ఆయన అసాధ్యమని అనుకున్న తెలంగాణాను సాధించారు. ఇపుడు దేశంలో మోడీ హవాను అడ్డుకోవడం అసాధ్యం అన్న మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. దాంతో కేసీయార్ అది తప్పు అని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన దృఢ సంకల్పంతో ఆయన పట్టువదలని విక్రమార్కుడిగా మారి మరీ మోడీతోనే ఢీ కొడుతున్నారు.

ఇప్పటిదాకా మోడీని ఎన్ని విమర్శలు చేసినా కూడా అది కేవలం కేసీయార్ ఒంటరిగానే చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాను పిలిచి మరీ విమర్శించారు. ఇపుడు అంటే ఫస్ట్ టైమ్ ఆయన డైరెక్ట్ గా హస్తిన వేదికగా యాక్షన్ ప్లాన్ లోకి దిగుతున్నారు.

మోడీని ఢిల్లీలోనే ఢీ కొట్టడానికి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఆయన శనివారం అంటే రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈసారి కేసీయార్ ఢిల్లీ వెళ్ళేది ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో బీజేపీ సర్కార్ కి ఊపిరి ఆడనీయకుండా చేయడానికన్న మాట.

గతానికి భిన్నంగా అన్ని పార్టీలు కలసి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పార్లమెంట్ వేదికగా లేవనెత్తాలని కేసీయార్ భావిస్తున్నారు. దానికి తగిన వ్యూహరచన చేయడానికి ఆయన రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన బీహార్ లోని ఆర్జేడీ నాయకుడు తేజస్వీయాదవ్ తో పాటు మిగిలిన  జాతీయ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు.

అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, జాతీయ విపక్ష నేతలతో ఫోన్ లో  మాట్లడారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. తెలంగాణా సహా దేశానికి కేంద్రం చేస్తున్న అన్యాయం మీద గట్టిగానే నిలదీయాలని ఆయన డిసైడ్ అయ్యారు.

ఇంకోవైపు చూస్తే కేసీయార్ జాతీయ పార్టీని ప్రకటిస్తారు అని వార్తలు వస్తున్నాయి. దానికి నాందిగా ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని చెబుతున్నారు. దేశంలోని జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి మోడీ మీద యుద్ధమే చేయాలని కేసీయార్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. చూడాలి మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయో.
Tags:    

Similar News