టీఆర్ ఎస్ రావణాసుర పార్టీ.. కవిత తాటకి

Update: 2016-09-04 15:48 GMT
అందరూ మాట్లాడతారు. కానీ.. కొందరి మాటలే ప్రభావం చూపేలా ఉంటాయి.  రాజకీయ నేతలంతా విమర్శలు చేస్తుంటారు. కానీ.. కొందరి విమర్శలే అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారతాయి. మాటలతో మంటలు పుట్టించే తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చినంత బాగా మరెవరికీ రాదేమో. నిజానికి కేసీఆర్ తో పాటు.. ఆయన కుటుంబ సభ్యులందరికి ఈ విషయంలో ఉన్న పట్టు అంతాఇంతా కాదు.

తాజాగా కేసీఆర్ అన్న కూతురు రమ్య మాటల్ని వింటే.. కేసీఆర్ ఒక్కరే కాదు.. ఆయన ఫ్యామిలీ మొత్తంలోనూ మాటలతో మంట పుట్టించే తత్వం ఎక్కువన్న విషయం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ.. ఆయన కుటుంబ సభ్యులను కానీ ఇప్పటివరకూ ఏ రాజకీయ నేత అననంత ఘాటుగా ఆయన (కేసీఆర్) అన్న కూతురు.. కాంగ్రెస్ నేత రమ్య తాజాగా  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా జిల్లాల్ని విభజిస్తున్నారని.. టీఆర్ ఎస్ పార్టీ రావణాసుర పార్టీగా ఆమె అభివర్ణించారు.

తన బాబాయ్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన ఆమె.. తనకు వరసకు సోదరి అయిన ఎంపీ కవితపై ఊహించని రీతిలో వ్యాఖ్య చేశారు. ఎంపీ కవిత నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్న రమ్య.. ‘కవిత తెలంగాణ తాటకిగా మారారు’’ అని అన్నారు.  మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే  అరుణ గద్వాల్ గడిలో కాదని.. ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్.. కవితపై విమర్శలు చేసిన రమ్య తనకు సోదరుడైన కేటీఆర్ ను సైతం వదిలిపెట్టలేదు. సిరిసిల్లకు కేటీఆర్ గుదిబండగా తయారయ్యారని.. తండ్రి.. కుమార్తె.. కొడుకు తప్ప తెలంగాణలో మరెవరూ సంతోషంగా లేరని రమ్య చెప్పారు. ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై కేసీఆర్ ఫ్యామిలీ ఎలా  యాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News