కేసీఆర్ దర్శనం దొరకడం కష్టమే..

Update: 2016-06-23 07:50 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజధాని హైదరాబాద్ లో కంటే ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లోనే ఎక్కువగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన ఎక్కడున్నా కూడా తనను కలవడానికి వచ్చేవారిని కలుసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకపోవడం - అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. కొద్దికాలంగా పలువురు నేతలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో కేసీఆర్ ఉద్దేశమేంటి.. ? ఆయన నిజంగానే బిజీగానే ఉన్నారా లేదంటే కలవడం ఇష్టం లేకే నో చెబుతున్నారా అన్నది చర్చనీయాంశమవుతోంది.

ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల సమయంలో తనపై టీఆరెస్ అభ్యర్థిని పోటీకి దించొద్దని కోరేందుకు దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డి -ఆమెతో పాటు టీపీసీసీ చీఫ్ లు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగారు. కానీ, వారికి ఆ ఛాన్సు రాలేదు. దీనిపై కాంగ్రెస్ అప్పుడు తమ అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అపాయింట్మెంటు అడిగితే ఇవ్వకపోవడంపై వ్యతిరేకత వచ్చింది.

రీసెంటుగా ప్రజాకవి గూడ అంజయ్య కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. కానీ... ఆయనకూ కేసీఆర్ దర్శనం దొరకలేదు. అంజయ్య ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో నిమ్సులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంజయ్య ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిన కేసీఆర్ ఆయన చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కానీ తన దర్శనం మాత్రం ఇవ్వలేదు. చనిపోయే ముందు కేసీఆర్ ను కలవాలని అంజయ్య తన కోరికను వ్యక్తంచేసినా కూడా కేసీఆర్ అందుకు అంగీకరించలేదు. రాష్ట్రంలోని సమస్యలపై చర్చించేందుకు కొందరు తెలంగాణ మేధావులు కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా వారికీ నిరాశే ఎదురైందట.  దీంతో కేసీఆర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది. ఆయన తీరిక లేకుండా ఉన్నారని టీఆరెస్ వర్గాలు చెబుతుంటే అదేమీ లేదని.. తనకు ఇష్టం లేనివారికి కలిసేందుకు ఆయన ఇష్టపడడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ఆయన ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News