కేసీఆర్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారంటే..?

Update: 2018-09-04 09:57 GMT
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముంద‌స్తు మూడ్ లోకి వ‌చ్చేసింది. సీఎం కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవ‌టం.. అందుకు త‌గ్గ‌ట్లే మార్పులు చేర్పులు వ‌డివ‌డిగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముంద‌స్తులో భాగంగా కొంగ‌ర క‌లాన్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించటం.. అనుకున్నంత భారీగా జ‌నం రాక‌పోవ‌టంతో ఈ స‌భ ప్లాప్ షోగా మారింద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

స‌భ మీద ర‌భ‌స ఓ ప‌క్క సాగుతున్న వేళ‌. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగం మీదా భారీ చ‌ర్చ సాగుతోంది. ఎప్పుడూ లేని రీతిలో కేసీఆర్ ప్ర‌సంగంలో ప‌స త‌గ్గి.. న‌స ఎక్కువైంద‌న్న విమ‌ర్శ పెరిగింది. అంతేకాదు.. ఆయ‌న మాట‌లు మంత్ర‌ముగ్దుల్ని చేయాల్సిన స్థానే.. చిరాకు తెప్పించాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

దాదాపు గంట‌న్న‌ర పాటు కేసీఆర్ ప్ర‌సంగం సాగుతుంద‌న్న ప్రచారం జ‌రిగినా కేవ‌లం 48 నిమిషాల పాటు మాత్ర‌మే మాట్లాడ‌టం.. అందులో పాత విష‌యాలే ఎక్కువ‌గా ఉండ‌టంతో పాటు స‌భ‌కు వ‌చ్చిన వారితో పాటు.. టీవీల్లో లైవ్ చూసిన వారు సైతం నీర‌సానికి గురైన ప‌రిస్థితి.

ఇప్ప‌టివ‌ర‌కూ టీఆర్ ఎస్ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌ల‌న్నీ ఫుల్ స‌క్సెస్ అయి.. పార్టీని మ‌రింత జోష్ లోకి తీసుకెళితే.. తాజా స‌భ మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితికి కార‌ణ‌మైంది. స‌భ ప్లాప్ షోగా మారింద‌న్న మాట స‌ర్వ‌త్రా వినిపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎక్క‌డున్నారు?  ఏం చేస్తున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ముంద‌స్తు ఎన్నిక‌ల క‌స‌ర‌త్తుకు సంబంధించి కీల‌క అంశాల మీద ఆయ‌న చ‌ర్చిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

కొంగర స‌భ స‌క్సెస్ కాక‌పోవ‌టాన్ని ఆయ‌న సీరియ‌స్ గా తీసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది. జ‌రిగిపోయిన విష‌యాన్ని వ‌దిలేసి.. జ‌ర‌గాల్సిన వాటిపై దృష్టి పెట్టాల‌న్న మాట‌ను పార్టీ వ‌ర్గాల‌కు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ముంద‌స్తు మీద స‌భ ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని.. అనుకున్న‌ట్లే ఎన్నిక‌ల‌కు సిద్ధం అయ్యేలా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఫాంహౌస్ లో ఉన్న ఆయ‌న‌.. అసెంబ్లీ ర‌ద్దుపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. పార్టీ సీనియ‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న కేసీఆర్‌.. ముందు అనుకున్న‌ట్లుగా ఈ నెల ఆరున కానీ ఏడున కానీ అసెంబ్లీ ర‌ద్దున‌కు ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో కొంగ‌ర స‌భ ఫెయిల్యూర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు 7న హుస్నాబాద్ లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు.ఈ స‌భ‌కు కేసీఆర్ హాజ‌రు కానున్నారు. ఎప్ప‌టిలానే తాజా బ‌హిరంగ స‌భ బాధ్య‌త‌ల్ని మంత్రి హ‌రీశ్ రావుకు అప్ప‌గించారు కేసీఆర్‌. హ‌రీశ్ తో పాటు.. ఈటెల రాజేంద‌ర్ కూడా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. 2014లో త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. అదే సెంటిమెంట్ ను తాజాగా కంటిన్యూ చేయ‌నున్నారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది.

ఇప్ప‌టివ‌ర‌కూ వినిపిస్తున్న అంచ‌నాల ప్ర‌కారం ఈ నెల 6న అసెంబ్లీని కొలువు తీర్చి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టిస్తార‌ని.. ఆ ప‌క్క రోజునే హుస్నాబాద్ లో స‌భ‌ను నిర్వహిస్తారు. ఈ స‌భ‌తో కొంగ‌ర హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
Tags:    

Similar News