ఏపీకి కొత్త ప్ర‌తిపాద‌న పెట్టిన కేసీఆర్

Update: 2017-01-07 16:46 GMT
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాలకు సంబంధించిన పేచీలు కొలిక్కి రానున్నట్లుగా క‌నిపిస్తోంది. ఇరు రాష్ట్రాలూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించాయి. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు - తెలంగాణ రాష్ట్రం నుండి ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కూర్చుని అంశాలవారీ సమస్యలను అధ్యయనం చేసి కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ కమిటీ తీసుకునే నిర్ణయాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉంటాయని తెలిసింది. కమిటీ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

ఇటీవల రాజ్‌ భవన్‌ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడును కలిసి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య చెల్లింపులకు సంబంధించి కూడా అనేక సమస్యలున్నాయని, అందులో సింగరేణి అంశం కూడా ఉందని మంత్రుల స్థాయి కమిటీ కూర్చుంటే ఇది కూడా పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిపాద‌న చూస్తుంటే...పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తో పేచీలు వ‌ద్ద‌ని భావిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రం విడిపోయి దాదాపు మూడేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా పేచీలు ఎందుకు అనే భావ‌న‌లో ఇద్ద‌రు సీఎంలు ఉన్న‌ట్లుగా ఉంద‌ని చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News