కేసీఆర్ క‌ల వింటుంటే గొర్రెలు గుర్తుకొస్తున్నాయ‌ట‌!

Update: 2018-06-05 04:49 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి మాట్లాడ‌టం మొద‌లు పెట్టినంత‌నే ప్ర‌సంగం ఎప్పుడు పూర్తి అవుతుందిరా బాబు అన్న‌ట్లు ఉంటుంది. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరే వేరు. ఆయ‌న ఎంత సేపు మాట్లాడినా.. ఇంకాస్త సేపు మాట్లాడితే బాగుండ‌న్న భావ‌న క‌లిగిస్తుంటుంది. కేసీఆర్‌ ను తీవ్రంగా వ్య‌తిరేకించే వారు సైతం ఆయ‌న మాట‌ల ప్ర‌భావానికి గురి కావ‌టం తెలిసిందే. ఇక‌.. ఏదైనా అంశానికి సంబంధించి ఆయ‌న మాట్లాడ‌టం మొద‌లు పెడితే అలా వింటూ ఉండిపోవాల్సిందే.

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ప‌థ‌కాల్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. వాటితో పాటు త‌న క‌ల‌ల్ని వినూత్నంగా ఆవిష్క‌రించ‌టంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. దాదాపు ఏడాది క్రితం నాటి ముచ్చ‌ట గుర్తుందాం. అప్ప‌ట్లో గొర్రెల పేరిట జ‌రిగిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. గొర్రెపిల్ల‌ల‌తో తెలంగాణ ముఖ చిత్రం మొత్తంగా మార్చేస్తున్నామ‌ని.. తెలంగాణ వ్యాప్తంగా గొర్రె పిల్ల‌లు  క‌నిపించ‌ట‌మే కాదు.. వేలాది కోట్ల రూపాయిలు వ‌చ్చి ప‌డ‌తాయంటూ కేసీఆర్ క‌ల‌ల్ని అప్ప‌ట్లోనూ పత్రిక‌లు ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి.

కేసీఆర్ మాట‌లు విన్నోళ్లంతా.. ఛ‌త్.. మ‌న‌కు ఇలాంటి ఆలోచ‌న‌లు రావేంటి?  ఇంత అద్భుత‌మైన ప‌థ‌కాలు మ‌న‌కు త‌ట్ట‌వేంద‌న్న మాటా వినిపించింది.అయితే.. కేసీఆర్ చెప్పే ప‌థ‌కాల‌న్నీ కూడా అమ‌లు త‌ర్వాతే వాటి అస‌లు ముచ్చ‌ట బ‌య‌ట‌కు వ‌స్తుంది. గొర్రెల ప‌థ‌కం కాన్సెప్ట్‌.. ప్లాన్ అద్భుత‌మైనా.. ఆచ‌ర‌ణ విష‌యానికి వస్తేనే ఇబ్బంది అంతా.

కేసీఆర్ చెప్పిన టైం ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. తెలంగాణ‌లో పంపిణీ చేసిన ల‌క్ష‌లాది గొర్రెల జాడ క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఈ ప‌థ‌కంపై చోటు చేసుకున్న అవినీతితో పోలిస్తే.. అందుకు సంబంధించిన క‌థ‌నాలు ఒక్క శాతం కూడా రాలేద‌న్న మాట‌ను ప‌లువురు చెబుతున్నారు.

తాజాగా రైతుబంధు విష‌యంలోనూ కేసీఆర్ చాలానే గొప్ప‌లు చెబుతున్నారు. వాస్త‌వంలో మాత్రం ప‌రిస్థితి మ‌రోలా ఉందంటున్నారు. కేసీఆర్ ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల‌న్నీ రైతుల‌కు నేరుగా ల‌బ్థి పొందేలా చేస్తున్నా.. అస‌లు క‌ష్టం చేసే కౌలు రైతులు.. రైతు కూలీలకు మాత్రం తీర‌ని న‌స్టం వాటిల్లుతుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

రైతుబంధు ప‌థ‌కం భూములున్న వారికి అంతోఇంతో సంతోషాన్ని ఇవ్వ‌గా.. వ్య‌వ‌సాయం చేసే కౌలు రైతుల్లో మాత్రం అంత‌కు రెట్టింపు నిరాశ‌కు గురి చేసింది. భూములు ఉన్న వారంతా ల‌బ్థిదారులే కావ‌టం.. భూములున్నా వ్య‌వ‌సాయం చేయ‌ని వారికి సైతం ప్ర‌యోజ‌నం జ‌రుగుతుండ‌టంతో అర్థం ఏమైనా ఉందా? అన్న ప్ర‌శ్న‌ను కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌.. రైతు బీమా ప‌థ‌కంలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంటుందంటున్నారు.

అయితే.. అస‌లేం లేని దానితో పోలిస్తే.. అంతో ఇంతో ఎవ‌రో ఒక‌రికి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌టం స‌రికాద‌న్న మాట‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రైతులు పండించే పంట‌కు మంచి ధ‌ర వ‌చ్చేలా చేయ‌ట‌మే త‌మ క‌ల అని చెప్పినా.. శ‌క్తివంత‌మైన వ్యాపారుల లాబీ ముందు కేసీఆర్ క‌ల‌లు సాగ‌వ‌ని చెబుతున్నారు. వినేందుకు అద్భుతంగా ఉండి.. ఆచ‌ర‌ణ సాధ్యం కాని స్వ‌ప్నాలు గొర్రెల ప‌థ‌కంలా ఉంటుందే త‌ప్పించి మ‌రోలా ఉండ‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ కార‌ణంతోనే.. కేసీఆర్ తాజాగా వ్య‌వ‌సాయానికి సంబంధించి చెప్పిన మాట‌లు విన్న‌ప్పుడు.. అప్ర‌య‌త్నంగా ప‌లువురికి గొర్రెల ప‌థ‌కం గుర్తుకొచ్చింది.


Tags:    

Similar News