తెలంగాణ నిరుద్యోగుల కోసం ఆంధ్రోళ్లకు అన్యాయం..

Update: 2018-05-19 07:30 GMT
4 ఏళ్లుగా పూర్తయ్యాయి.. తెలంగాణలో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నారు. కానీ మళ్లీ ప్రజల మధ్య ఓ విభజన రేఖను గీస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ రేఖ వల్ల మళ్లీ తెలంగాణ-ఆంధ్ర ప్రజల మధ్య పొరపొచ్చాలకు కారణమవుతోంది.  మళ్లీ ప్రాంతీయ విభేదాలు పొడచూపుతున్నాయి. కేసీఆర్ చేస్తున్న ఈ పెద్ద తప్పు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అలజడులకు కారణమవుతోంది.

*స్థానికతతో ఆంధ్రోళ్లకు దెబ్బ

కేసీఆర్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో కానీ మళ్లీ స్థానికతకు కొత్త భాష్యం చెబుతున్నాడు. ఇన్నాళ్లు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివితే వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఈ రూలు మార్చాడు.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.  ప్రభుత్వం ఆమోదించి దీన్ని రాష్ట్రపతి సిఫారసులకు పంపించేందుకు రెడీ అయ్యింది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన కుటుంబాల పిల్లలు 1-4 వ తరగతి వరకు ఎక్కువగా ఆంధ్రాలో చదివి ఉంటారు.. కానీ కేసీఆర్ 1 వ తరగతి నుంచి 7వ తరగతి వరకూ తెలంగాణలో చదివిన వారినే పరిగణలోకి తీసుకోవడంతో   వలస కుటుంబాలకు స్థానికత నిర్ణయం శరాఘాతంగా మారింది.

*మళ్లీ ఆంధ్రా-తెలంగాణ ఇష్యూ

నిజానికి తెలంగాణ వచ్చిన కొత్తలో కరుడుగట్టిన విభజన వాది కేసీఆర్ సీఎంగా గద్దెనెక్కడంతో ఆంధ్ర ప్రజల్లో ఒకింత భయాందోళనలు వ్యక్తమయ్యారు. కేసీఆర్ ఎక్కడ తమను తరిమేస్తాడో.. రిజర్వేషన్లు సహా ఉద్యోగాల్లో ఆంధ్రావారికి అన్యాయం చేస్తారోనని భయపడ్డారు. కానీ మొదట్లో కాస్త భయపెట్టినా.. జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. ఆంధ్రా ప్రజలను అక్కున చేర్చుకున్నారు. దీంతో ఆంధ్రా-తెలంగాణ ప్రజల మధ్య ఈ నాలుగేళ్లలో ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదు. కానీ మళ్లీ అనవసరంగా స్థానికత వివాదాన్ని కెలికి కేసీఆర్ మరోసారి అలజడులకు కారణమవుతున్నారు.

*తెలంగాణ నిరుద్యోగుల కోసమే..

వచ్చేది ఎన్నికల సీజన్.. అందరినీ సంతృప్తి పరుస్తున్న కేసీఆర్ నిరుద్యోగులను మాత్రం నిరాశపరుస్తున్నారు. ఉద్యోగాల్లో ఆలస్యం.. నిర్వహణ వైఫల్యం వల్ల నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో ఉన్న జోనల్ వ్యవస్థను కూడా కొత్త జిల్లాల కారణంగా మార్చాల్సి ఉంది. అందుకే ఇటు జోనల్ సిస్టమ్ సెట్ చేసి స్థానికతను ఆంధ్రా ప్రజలకు దక్కకుండా చేయడానికి కేసీఆర్ స్కెచ్ గీశారు. తెలంగాణ నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కేలా వారిని సంతృప్తి పరిచేలా స్థానికత నిబంధనలు మార్చారు. ఈ నిబంధనలతో ఆంధ్రాలో చదవి తెలంగాణ వలస వచ్చిన వారికి అన్యాయం జరుగుతుంది. అదే సమయంలో తెలంగాణలో చదివిన విద్యార్థులకు మేలు జరుగుతుంది. స్వతహాగా తెలంగాణ వాది అయిన కేసీఆర్ వారికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణకు వలస వచ్చిన కుటుంబాలకు శరాఘాతంగా మారింది.

Tags:    

Similar News