కేసీఆర్ చెప్పినట్లే.. వాటి పేర్లను మార్చేస్తారా?

Update: 2020-04-26 06:02 GMT
వినూత్నంగా ఆలోచించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. నలుగురు నడిచిన బాటలో కాకుండా తన ప్రత్యేకత కనిపించేలా ఆయన కసరత్తు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఏదైనా అంశంపై తాను ఫోకస్ పెడితే.. దాని లోతుల్లోకి వెళ్లటమే కాదు.. విషయాన్ని సరికొత్తగా చూసే తీరు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా ఇదే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వెబినార్ లో స్పష్టమైంది కూడా.
.
తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్జీవోలతో కేంద్ర వైద్యశాఖ వెబినార్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక మచ్చగా ట్రీట్ చేయటం సరికాదన్న వాదన తెర మీదకు వచ్చింది. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన జగదానంద అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రానికి తరలించే వైనాన్ని ప్రస్తావించారు. ఈ కేంద్రానికి ఉన్న పేరును మార్చాలని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నట్లుగా వెల్ కం హోం అన్న పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుందన్న మాటను ప్రస్తావించారు.

దీనిపై పలువురు సానుకూలంగా స్పందించటమే కాదు.. కరోనా సోకటం పాపం ఎంతమాత్రం కాదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ 19 కారణంగా మరణాల సంఖ్య తక్కువగా ఉన్నందున.. ఈ వైరస్ బారిన పడటం మరణశిక్షతో సమానమన్న ఆలోచన నుంచి ప్రజలు బయటపడేలా చర్యలు తీసుకోవాలన్న సూచన పలువురి నుంచి వెల్లడైంది. అంతేకాదు.. కరోనాను మహమ్మారిగా అభివర్ణించటంపైనా అభ్యంతరం వ్యక్తమవుతోంది. వినూత్నంగా ఆలోచించటమే కాదు.. ప్రజల్లో భయాందోళనలు తగ్గేలా చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో కేసీఆర్ సూచనలు చర్చకు రావటం చూస్తే.. సారు గొప్పతనం అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News