ఇలా మాట్లాడితే తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ కాదా?

Update: 2017-11-02 05:16 GMT
న‌చ్చితే నెత్తిన పెట్టుకోవ‌టం.. న‌చ్చ‌కుంటే పుల్ల కంటే హీనంగా తీసి పారేయ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అల‌వాటే. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌ర‌గాల‌న్న ప‌ట్టుద‌ల ఎక్కువ పెద్ద‌మ‌నిషికి.  తాను ప‌ర్స‌న‌ల్ గా మొక్కిన మొక్కుల కోసం జేబులో నుంచి డ‌బ్బులు తీయ‌ని పెద్దాయ‌న‌.. ప్ర‌జ‌ల‌కు చెందిన వంద‌ల కోట్ల రూపాయిల్ని వంద‌లాది రూపాయిల‌న్నంత సింఫుల్ గా తేల్చిపారేయ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది.

మాట‌ల‌తో మ‌న‌సును దోచుకునే ఆర్ట్ లో పితామ‌హుడిగా పేరున్న కేసీఆర్‌.. విష‌యం ఏదైనా స‌రే త‌న‌కు న‌చ్చిన వాద‌న‌ను వినిపించి ప్ర‌జ‌ల్ని క‌న్వీన్స్ చేయ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

కేసీఆర్ అంటే పీక‌ల దాకా కోపం ఉన్నోళ్లు సైతం.. ఆయ‌న మాట్లాడ‌టం మొద‌లు పెట్టిన త‌ర్వాత పిధా అయిపోవ‌ట‌మే త‌ప్పించి.. ప్ర‌శ్నించాల‌న్న ఆలోచ‌న‌ను కూడా మ‌ర్చిపోతుంటారు. తాను ఏదైనా అనుకొని పూర్తి కావాల‌న్న ప‌ట్టుద‌ల‌కు పోతే.. ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. తాను న‌మ్మింది ఎంత నిజ‌మో క‌థ‌లు.. క‌థ‌లుగా చెబుతుంటారు.

ఎవ‌రైనా తెలంగాణ గురించి మాట జారినా అస్స‌లు స‌హించ‌లేని కేసీఆర్‌.. త‌న‌కు తానుగా మాత్రం నిండు అసెంబ్లీలో తెలంగాణ ప‌రువును ప్ర‌శ్నించే రీతిలో మాట్లాడ‌ట‌మే కాదు.. సీఎం కుర్చీలో కూర్చున్న త‌న‌లాంటి వారు మాట్లాడ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోరు. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా పూర్తి కావ‌టం కోసం అవ‌స‌ర‌మైతే తెలంగాణ ఇమేజ్ ను సైతం ప‌ణంగా  పెట్ట‌టానికి ఆయ‌న అస్స‌లు వెనుకాడ‌రు.

తెలంగాణ రాష్ట్రంలో స‌మ‌స్య‌లెన్నో. వాటిని ప‌ట్టించుకున్నా లేకున్నా.. తెలంగాణ స‌చివాల‌యాన్ని అర్జెంట్ గా మార్చేయాల‌ని త‌పిస్తుంటారు కేసీఆర్‌. వాస్తును విప‌రీతంగా న‌మ్మే ఆయ‌న‌.. తెలంగాణ స‌చివాల‌యం వాస్తుకు అనుకూలంగా లేద‌న్న మాట‌ను బ‌లంగా న‌మ్మారని.. ఇందులో భాగంగా స‌చివాల‌యాన్ని వేరేగా క‌ట్టించాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతారు.

తెలంగాణ స‌చివాల‌యాన్ని కొత్త‌గా నిర్మించాలంటూ ప‌దే ప‌దే చెప్పే కేసీఆర్ మాట‌ల వెనుక బ్యాక్ గ్రౌండ్ ఇదైతే.. ఆయ‌న మాత్రం దాని గురించి అస్స‌లు మాట్లాడ‌రు. ఒక‌వేళ మాట్లాడినా.. స‌చివాల‌యాన్ని మార్చేది వాస్తు కోసం కాద‌ని.. అన్ని అంశాల్లో వాస్తు ఒక అంశ‌మే త‌ప్పించి అదే మొత్తం కాద‌ని ఓపెన గానే చెప్పేశారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కొత్త స‌చివాల‌యం అవ‌స‌రాన్ని చెప్పే క్ర‌మంలో.. పాత స‌చివాల‌యాన్ని ప‌రువు తీసేలా మాట్లాడ‌టం కేసీఆర్‌ కు మాత్ర‌మే చెల్లుతుందేమో? ఇదే రీతిలో గ‌తంలో ఎవ‌రైనా మాట్లాడితే.. తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీసేలా.. తెలంగాణ ఇమేజ్‌కు భంగం వాటిల్లేలా మాట్లాడార‌ని విరుచుకుప‌డ్డారేమో. కానీ.. ఇప్పుడు స‌చివాల‌యాన్ని మార్చాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ అసెంబ్లీలో స‌చివాల‌యం గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. తెలంగాణ‌ను తిట్టాల‌న్నా.. పొగ‌డాల‌న్నా త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌న్న రీతిలో కేసీఆర్ తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయి,

తెలంగాణ స‌చివాల‌యం అస్స‌లు బాగోలేద‌న్న మాటను చెప్పొచ్చు. కానీ.. ఆ క్ర‌మంలో తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాట్లాడార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌నంత చెత్త సచివాల‌యం మ‌రెక్క‌డా లేద‌ని.. ఏ ఒక్క‌టీ స‌రిగా లేద‌ని.. నిబంధ‌న‌ల్ని పాటించ‌లేద‌ని.. అనుమ‌తులు లేవ‌ని.. వంక‌ర టింక‌ర నిర్మాణాలుఉన్నాయ‌ని.. అందుకే కొత్త స‌చివాల‌యం ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

కొత్త స‌చివాల‌య నిర్మాణానికి నిధులు వృధా చేస్తున్నార‌న్న మాట‌ను సింపుల్ గా కొట్టిపారేసిన ఆయ‌న‌.. ఏపీలో కొత్త‌గా నిర్మిస్తున్న అమ‌రావ‌తి ఆకృతుల్ని చూస్తున్నారా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. మ‌నం మారొద్దా? అంటూ చెప్ప‌టం చూస్తే.. ఎవ‌రినో చూసి మ‌నం ఉలిక్కిప‌డ‌టం ఎందుక‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. ఇప్పుడున్న మౌలిక వ‌స‌తుల‌తో వృధాఖ‌ర్చును అదుపు చేసి ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచాల్సిన పాల‌కులు.. భ‌వ‌నాల మీద‌.. వాటికుండే వ‌స‌తుల మీదా దృష్టి పెట్ట‌టం ఏమిటి?

స‌చివాల‌యం సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టం లేదు స‌రే. అలా అని.. కేసీఆర్ అనుకున్న‌ట్లుగా స‌చివాల‌యం నిర్మించ‌టంతోనే స‌రిపోదు. చాలానే మార్చాల్సి ఉంటుంది. అలా మార్చుకుంటూ పోతే.. ఎక్క‌డికి ఆగేది. స‌చివాల‌యానికి మ‌హా అయితే 125 కోట్లు అంటూనే.. క్ష‌ణాల్లో అంచ‌నాలు పెంచేసి 240 కోట్లుగా చెప్పిన కేసీఆర్ అంత‌లోనే త‌న మాట‌ల ప్ర‌వాహాన్నికొన‌సాగిస్తూ.. అయితే గియితే రూ.400 కోట్లు అవుతాయి? ఆ మాత్రం ఖ‌ర్చు పెట్టలేని దీన‌స్థితిలో ఉన్నామా? అంటూ వంద‌ల కోట్ల రూపాయిల ఖ‌ర్చును చాక్లెట్ కొన్నంత సింఫుల్ గా తీసిపారేయ‌టం చూస్తే.. కేసీఆర్ ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారా? అన్న సందేహం రాక మాన‌దు. పాల‌కుడిగా.. ప్ర‌జ‌ల సొమ్ముకు ధ‌ర్మ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన కేసీఆర్.. సౌక‌ర్యాల పేరుతో వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టే ప‌నిని ఎంత సింఫుల్ గా స‌ర్ది చెప్పుకుంటున్నారో చూస్తే.. ఆయ‌న చాతుర్యానికి పిధా కావాల్సిందే. ఏమైనా ఘ‌న చ‌రిత్ర ఉన్న స‌చివాల‌యాన్ని పూచిక పుల్ల లెక్క‌న తీసి పారేయ‌ట‌మే కాదు.. చుల‌క‌న‌గా మాట్లాడ‌టం కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్యమేమో?
Tags:    

Similar News