కేసీఆర్ పెద్ద‌ల స‌భ అభ్య‌ర్థులు.. ట్విస్టులు

Update: 2018-02-14 14:29 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు పార్టీ శ్రేణుల‌ను ఉత్కంఠలో ప‌డేశార‌ని అంటున్నారు. త్వరలో జరుగనున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఈ విడత జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో తెలంగాణాకు దక్కే మూడు స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయి. విపక్ష పార్టీలన్నీ కలిసినా రాజ్యసభ స్థానం దక్కించుకునే అవకాశం లేకపోవడంతో మూడు స్థానాలు గులాబి పార్టీ నేతలకే వరించనున్నాయి. పెద్దల సభకు ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చలు జ‌రుగుతున్నాయి.

ఏప్రిల్‌లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయన్న చర్చలు మొదలయ్యాయి. ఈ పోస్టుల విష‌యంలో కుల స‌మీక‌ర‌ణాల‌కు కేసీఆర్ తెర‌తీసిన‌ట్లు స‌మాచారం.  తెలంగాణాకు దక్కే మూడు స్థానాలను మూడు వర్గాలకు కేటాయించాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. అగ్రవర్ణాలకు చెందిన ఎంతో మంది నేతలు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవాలని ఊవ్విళ్లూరుతున్నా.. ముఖ్యమంత్రి సమీప బంధువు.. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెంట ఉన్న సంతోష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల లేదా కురమ కులస్తులో ఒకరికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని కేసీఆర్ వెల్లడించారు. దీంతో పార్టీలో ఆ వర్గానికి చెందిన ఐదుగురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ - నోముల నర్సింహయ్యతో పాటు రాజయ్యయాదవ్ - మురళీ యాదవ్‌లలో ఒకరికి రాజ్యసభ స్థానం దక్కునుందన్న ప్రచారం జరుగుతోంది.

తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి పార్లమెంట్ సభ్యులుగా మైనార్టీలు పార్టీ తరపున ప్రస్తుతం ప్రాతినిథ్యం లేకపోవడంతో మైనార్టీ నేతకు అవకాశం కల్పించే చాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరో స్థానాన్ని దళితులు లేదా మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.  మొత్తానికి మూడు రాజ్యసభ స్థానాలకు చాలామంది ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టార‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో గులాబీ ద‌ళ‌ప‌తి ట్విస్టుల‌కు పార్టీ నేత‌లు షాక్ తింటున్నార‌ని అంటున్నారు.
Tags:    

Similar News