అందరికి పండగంటే... లెక్క చాలానే ఉంది

Update: 2016-10-07 05:47 GMT
పండగపూట అందరూ పండగ చేసుకోవాలి. కొందరు పండుగ చేసుకుంటే.. మరికొందరు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏం బాగుంటుంది. పండగ అందరికీ పండగే కావాలి. అందరూ సంతోషంగా ఉండాలి. నాలుగు జిల్లాలు ఎక్కువైనా ఫర్లేదు.. అందరూ హ్యాపీగా ఉండటమే కావాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన‌ మాటలకు తగ్గట్లు చేతలు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. కొత్త జిల్లాలకు సంబంధించి మొదటి నుంచి తనదైన నిర్ణయాల్ని మాత్రమే అమలు చేసే కేసీఆర్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాలు కోరుకునే వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఎలాంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకునే అలవాటు ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లే కొత్త జిల్లాల విషయంలోనూ అలాంటి విధానాన్నే పాటించారు. కొత్త జిల్లాలపై పెద్ద ఎత్తున సాగుతున్న నిరసనల్ని.. ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకొని.. సెంటిమెంట్ తో చెలగాటం మంచిది కాదన్న ఉద్దేశంతో అమాంతంగా నాలుగు కొత్త జిల్లాలకు ఓకే చెప్పేసి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొత్త జిల్లాల విషయంలో ముఖ్యమంత్రి కరుకుగా ఉన్నారని.. ఆయన అనుకున్న జిల్లాలనే తప్పించి.. ప్రజలు కోరుకున్న జిల్లాల్ని ఆయన ఇవ్వరన్న ప్రచారం తప్పన్న విషయాన్ని తన తాజా నిర్ణయంతో కేసీఆర్ తేల్చి చెప్పినా.. ఆయనకు సమస్యలు తీరలేదు.

కొత్త జిల్లాలపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు ఇప్పుడదే పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజలు కోరుకున్న జిల్లాల్ని ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పిన వేళ నుంచి.. మరిన్ని కొత్త జిల్లాల డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. కొత్త జిల్లాల విధివిధానాలు తేల్చటానికి ఏర్పాటు చేసిన హైపర్ కమిటీకి కొత్త జిల్లాలకు సంబంధించిన వినతులతోపాటు.. ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.

తాజాగా వస్తున్న వినతులు.. డిమాండ్లను చూసినప్పుడు ఎన్ని జిల్లాల్ని ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారన్న లెక్క తీస్తే.. కాసింత షాక్ కు గురి కావాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడు అనుకుంటున్న 31 జిల్లాలు కాకుండా తమకుంటూ కొత్త ఐడెంటిటీ కావాలని కోరుకుంటున్న జిల్లాలు‘‘8’’గా ఉండటం గమనార్హం. నిజానికి ఈ జిల్లాలకు సంబంధించి ప్రజల్లో ఆశల విత్తనాల్ని నాటింది కేసీఆరే అని చెప్పక తప్పదు. గతంలో వరంగల్ జిల్లాలోని ములుగు ప్రాంతాన్ని సమ్మక్క – సారలమ్మ జిల్లా చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని ఆ ప్రాంతం వాసులు గుర్తు చేస్తున్నారు.

ఇదే తీరులో వివిధ జిల్లాలకు సంబంధించిన కొత్తవాదనలు తెరపైకి వస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల్లో కొత్త జిల్లాలకు సంబంధించి వెల్లువెత్తుతున్న డిమాండ్లను చూస్తే.. మొత్తం ఎనిమిది కొత్త జిల్లాలుగా చెప్పాలి. ఈ కొత్త జిల్లాల లెక్క ఇలా ఉంటే.. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీల ప్ర‌కారం కొత్త‌ జిల్లాలు ఏర్పాటు జరగటం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గద్వాల్ జిల్లాకు జోగులాంబ పేరు పెడతామని చెప్పారని.. కానీ జోగులాంబ ఉన్న ఆలంపూర్ ను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారని.. ఇదేం పద్ధతని ప్రశ్నిస్తున్నారు. వివిధ జిల్లాలకు సంబంధించి ఇలాంటి అభ్యంతరాలు చాలానే వస్తున్నాయి. తాజాగా కొత్త జిల్లాల డిమాండ్లు వస్తున్న వాటిని చూస్తే..

దేవరకొండ

మిర్యాలగూడెం

ఉట్నూరు

భద్రచాలం

ఏటూరు నాగారం (లేదా) ములుగు

సమ్మక్క – సారలమ్మ

ఇబ్రహీంపట్నం

సత్తుపల్లి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News