అది కేసీఆర్ ఇల్లు కాదు.. ప్రజల ఆస్తి అంట

Update: 2016-12-27 17:52 GMT
చురుకైన మాటలతో చురుకుపుట్టించేలా మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. విపక్షాలన్నీ తన పర్సనల్ ఫీలింగ్స్ ను పట్టించుకోకుండా.. ముచ్చట పడి కట్టించుకున్న ఇంటి గురించి అవాకులు చవాకులు పేలుతూ.. విమర్శలతో ఉక్కిరి చేయటాన్ని ఆయన అస్సలు భరించలేనట్లుగా కనిపించింది. వందల కోట్ల రూపాయిలతో (కేసీఆర్ మాత్రం అంత లేదని చెప్పటం వేరే విషయం) రాజ ప్రసాదం లాంటి లంకంత ఇంటిని కట్టించిన ఆయన.. భావోద్వేగానికి గురై.. ఇదేమైనా కేసీఆర్ ఇల్లా.. అది ప్రజల ఆస్తి అని చెప్పుకొచ్చారు.

విపక్షాల నోళ్లకు తాళం వేసేలా కేసీఆర్ మాట్లాడారనటంలో సందేహం లేదు. కానీ.. ఆ మాటల్లో నిజం ఎంతన్నది బహిరంగ రహస్యమే. నిజంగానే తెలంగాణ ఆస్తి అయితే.. ఇంకో కొత్త ఇల్లు కట్టించాల్సిన అవసరమే లేదు. ఆ భవనం కట్టటానికి అయిన అసలు ఖర్చుతో ఒక పల్లె మొత్తాన్ని పూర్తిగా మార్చేయొచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భవనాలు.. అధికారులు నివసించే అధికారిక గృహ సముదాయాలన్నీ ప్రజల ఆస్తే. ఆ విషయంలో మరెలాంటి సందేహం లేదు. కానీ.. పన్నులు కట్టే ఒక మధ్యతరగతి జీవికి లభించే వసతులకు.. పాలించే పాలకులకు.. అధికారం చెలాయించే అధికారులకు లభించే గృహ సముదాయాల వసతులు చూసినప్పుడు.. ప్రజల సొమ్ముతో ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది.

కాస్త లోతుగా ఆలోచించినప్పుడు కలిగే భావన ఒక్కటే. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి నమ్మకాలు దెబ్బ తినేలా ఉంటే.. ఎన్ని కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అయినా తనకు నచ్చింది కట్టించేసుకుంటారు. అదే సమయంలో ప్రజలు పడే అవస్థల నుంచి విముక్తి చేయటానికి మాత్రం ఒకపట్టాన పరిష్కారం దొరకని పరిస్థితి. తమకున్న నమ్మకాల్ని ప్రజాధనంతో తీర్చుకోవటం.. తాము నమ్మిన దేవతలకు తాము చేసిన మొక్కుల్ని ప్రజల సొమ్ముతో తీర్చుకునే అధినేతల్ని చూసినప్పుడు.. రాజరికానికి.. ప్రజాస్వామ్యానికి పెద్ద వ్యత్యాసం ఉన్నట్లు కనిపించదు. రాజరికంలో అయితే అసెంబ్లీలు.. విపక్షాలు ఉండవు.. ప్రజాస్వామ్యంలో ఉంటాయంతే. రాజరికపు రాజులు.. ప్రజాస్వామ్య పాలకులు తమకు నచ్చింది చేసుంటూ పోతారు. పేర్లు తప్పితే.. పవర్ చేతిలో ఉన్నోడు చేసే పనుల్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News