తెలంగాణకు ఆ రెండే దిక్కు

Update: 2015-12-31 17:30 GMT
గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహట్టి - కరీంనగర్ జిల్లాలో మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం చాలా పట్టుదలతో పావులు కదుపుతోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించింది. రాబోయే మూడేళ్లలో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మిస్తే తెలంగాణలో కేసీఆర్ కు భవిష్యత్తులో కూడా ఎదురుండదు.

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చుక్క నీరు రావడం లేదు. గోదావరి నదిలో వచ్చిన మొత్తం నీటిని ఆ రాష్ట్రం మహారాష్ట్రలోనే రిజర్వాయర్లు నిర్మించి నిలిపేస్తోంది. కర్ణాటక నుంచి కూడా చుక్కనీరు కిందకు రావడం లేదు. బాబ్లీతోపాటు మరో 150 చిన్న చిన్న ప్రాజెక్టు లను నిర్మించి మొత్తం నీటిని కర్ణాటక వాడుకుంటోంది. దీనికితోడు గత మూడేళ్లుగా వరదలు - వర్షాలు లేవు. అందుకే తెలంగాణ మొత్తం కరువు కాటకాలతో విలవిలలాడుతోంది. శ్రీరాంసాగర్ కింద ఐదు జిల్లాల్లోని 16 లక్షల ఎకరాల ఆయకట్టు బీడువారిపోయింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇటు కృష్ణా నదిలో నీళ్లు లేవు. అటు గోదావరిలో నీళ్లు లేవు. ఒకవేళ గోదావరికి వరద వచ్చినా ఆ నీళ్లన్నీ నేరుగా భద్రాచలం నుంచి ఏపీలోకి వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి.

గోదావరి, దాని ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, మంజీర నీటిని తెలంగాణలో వాడుకునే పరిస్థితులు లేవు. ఒకవేళ వాటిని వాడుకోవాలంటే రివర్స్ ఇంజనీరింగే దిక్కు. అంటే కిందకు వచ్చిన నీటిని కర్ణాటక - మహారాష్ట్ర తరహాలో చిన్న చిన్న బ్యారేజీలు కట్టి నిల్వ చేసి, పెద్ద ఎత్తున విద్యుత్తును  ఉపయోగించి దానిని ఎగువకు మళ్లించడమే. కేసీఆర్ రూపొందించిన డిజైన్ కూడా ఇదే.

దీనిని పూర్తి చేయాలంటే లక్ష కోట్ల రూపాయల నిధులు కావాలి. ఏడాదికి 5000 మెగావాట్ల విద్యుత్తు అదనంగా కావాలి. అయినాసరే.. తెలంగాణలో సాగుభూములు సస్యశ్యామలం కావడానికి ఇంతకుమించిన దిక్కు లేదు. వాటిని నిర్మిస్తే రైతులు బాగుంటారు. లేకపోతే పొలాలు బీళ్లవుతాయి.
Tags:    

Similar News