పవన్ మాస్టర్ ప్లాన్ వైసీపీకి అర్ధమవుతోందా ?

అయితే విపక్ష పాత్రగా వైసీపీ ఏమి చేస్తోంది అన్నది కూడా ఇక్కడ చర్చకు ఆస్కారం ఇస్తోంది

Update: 2024-11-05 19:30 GMT

ఏపీలో విపక్షంలో తామే ఉన్నామని మరే పార్టీ లేదని వైసీపీ చెప్పుకుంటూ వస్తోంది. అయితే విపక్ష పాత్రగా వైసీపీ ఏమి చేస్తోంది అన్నది కూడా ఇక్కడ చర్చకు ఆస్కారం ఇస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదారు నెలలు అవుతున్నా వైసీపీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే విపక్షం కనిపించేది ప్రజలలో అలాగే అసెంబ్లీలో. ఈ రెండు చోట్లా వైసీపీ మిస్ అవుతోంది. ఏదో కొన్ని సందర్భాలలో పరామర్శలు చేస్తూ వస్తున్నారు తప్ప పూర్తి ష్తాయిలో ఫీల్డ్ లోకి దిగలేకపోతున్నారు. కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదు అనుకుంటే కొన్ని సూచనలు అయినా చేసి ఉండవచ్చు.

అలాగే అసెంబ్లీకి వెళ్ళి సలహాలు ఇవ్వవచ్చు. కానీ 11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా కావాలని పట్టుబట్టి పంతానికి పోయి వైసీపీ అసెంబ్లీనే కాదనుకుంది. దాని వల్ల అక్కడ ఆ పార్టీ మిస్ అయినట్లు అయింది. ఇక జనంలో అయితే జగన్ అపుడపుడు వచ్చినా పార్టీ మొత్తం అయితే నిస్తేజం అయింది. ఎవరూ జనంలో కనిపించడం లేదు.

అదే విధంగా చూస్తే జగన్ కూడా ఇటీవల కాలంలో కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆయన కుటుంబంలోనే వివాదాలు చుట్టుముట్టడంతో ఇబ్బందిని పడుతున్నారు. దాంతో ఏపీలో విపక్షం అన్నది లేదన్న భావన అయితే జనంలో ఏర్పడింది. సరిగ్గా టైం చూసి ఈ స్లాట్ లోకి జనసేన దూరేసిందా అన్నది పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన పిఠాపురం పర్యటనలో చర్చగా వస్తోంది.

పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో మాట్లాడింది జనం వైపు నుంచి. వారి గొంతుకగా మారి ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ప్రభుత్వంలో ఉంటూ ప్రశ్నించకూడదు అని అంటారు. కానీ అది రాజకీయం స్ట్రాటజీ అవుతుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం లో ఉంటూ కూడా తప్పులు ఉంటే ప్రశ్నిస్తే అది నిజాయతీ అవుతుంది, నిబద్ధత కూడా అవుతుంది. పవన్ ఇపుడు అదే చేశారు అని అంటున్నారు.

తాము అధికారంలో ఉన్నా కూడా ప్రజా రక్షణ విషయంలో ప్రజా సమస్యల విషయంలో తగ్గేది లేదు అన్న సందేశం ఆయన పంపించడం ద్వారా ప్రభుత్వంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే వాటిని సరిచేసే యత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆయా సెక్షన్లను దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఆయన వైఖరి ఉంది.

అంటే అధికారంలో తాము ఉన్నా నిర్మాణాత్మకమైన విపక్షంగా వ్యవహరిస్తామని పవన్ చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇది ఒక విధంగా వైసీపీకి మింగుడు పడనిదే. పవన్ చేసిన కామెంట్స్ జనంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఆయన జనం నాడిని పట్టుకుని దానిని తగినట్లుగా ఇచ్చిన స్టేట్మెంట్స్ బాధిత సెక్షన్లలోకి బలంగా వెళ్ళాయి. తద్వారా జనసేన అక్కడ పొలిటికల్ గా మైలేజ్ ని సాధించింది.

అంతే కాదు తాము అండగా ఉంటామన్న సందేశాన్ని పంపించింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉండాల్సిన వైసీపీ తన పాత్రను మిస్ చేసుకుంటోంది అన్న భావన అయితే కనిపిస్తోంది. మొదట్లో పవన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని చంకలు గుద్దుకున్న వైసీపీకి ఆ తరువాత జనసేనాని వేసిన స్టెప్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ అర్ధం అయ్యేసరికి తత్వం బోధపడింది అని అంటున్నారు.

అందుకే అర్జంటుగా మాజీ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి పవన్ కి పొలిటికల్ గా ఓరియెంటేషన్ అవసరం అని అన్నారు. ఆయన అధికారంలో ఉన్నారు. ప్రశ్నించడం కాదు,జవాబులు ప్రభుత్వం చెప్పాలి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అంటే తనను తాను నిలదీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అంటే వైసీపీలో మొదలైన కంగారు అలజడికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు. విపక్ష స్థానం మెల్లగా జనసేన తీసుకుంటోంది అన్నది వైసీపీకి అర్ధం అయింది అని అంటున్నారు. మరి వైసీపీ నిద్రావస్థలో ఉంటే అదే జరుగుతుంది అని అంటున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తారు, అలగే ప్రతిపక్షం వైపు కూడా చూస్తారు.

కానీ అయిదారు నెలలుగా తమకు అప్పగించిన విపక్ష పాత్రను వైసీపీ సవ్యంగా పోషించలేదు అందుకే ఆ స్లాట్ ఖాళీగా ఉందని గ్రహించే పవన్ అక్కడికి వెళ్తున్నారు అని అంటున్నారు. అంటే కూటమి పెద్దలు వైసీపీకి ఎక్కడా ఏ చాన్స్ ఇవ్వకుండా ఆడా తామే ఈడా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ఇదే తీరున జనసేన జోరుని చూపిస్తే కనుక కచ్చితంగా ఏపీలో వైసీపీని జనాలు మరచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే అర్జంటుగా వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో వైసీపీ అసెంబ్లీకి అటెండ్ కావాలి. అలాగే జనంలోనూ ఉండాలి. ప్రజా పక్షంగా తాము ఉన్నామని గట్టిగా చెప్పుకోకపోతే మాత్రం ఆనక విపక్ష స్థానమూ పాయే అని చింతించినా ప్రయోజనం లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News