తెలంగాణ‌లో ఇక ఆయ‌నదే ఆల్ రౌండ్ షో

Update: 2016-10-09 22:30 GMT
తెలంగాణ‌లో జిల్లాల పెంపు విష‌యం.. ఇప్పుడు అనేక అంశాల‌ను ప్ర‌భావితం చేస్తోంది!  ప్ర‌స్తుతం ఉన్న 10 జిల్లాల‌ను 31 జిల్లాలు గా చేయాల‌ని సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్‌ తో సిద్ద‌మైపోయారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, అస‌లు జిల్లాల పెంపుతో రాష్ట్ర ముఖ చిత్రం మారిపోవ‌డం అటుంచితే.. వివిధ ప‌క్షాల నేత‌లు, అధికారుల అధికారాల్లోనూ కోత ప‌డుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌స్తుతం 10 జిల్లాల తెలంగాణ 31 జిల్లాలుగా అవ‌త‌రిస్తే.. నియోజ‌క‌వ‌ర్గాలు ఒక‌టికి మించి రెండు జిల్లాల ప‌రిధిలోకి వెళ్లే అవ‌కాశం ఉంది. అదేవిధంగా జిల్లాల విభ‌జ‌న‌తో రెవెన్యూ డివిజ‌న్లు మారిపోతాయి. అదేవిధంగా మండ‌లాల సంఖ్య పెరుగుతుంది. మండ‌లాల విభ‌జ‌న కూడా జ‌రుగుతుంది.

దీంతో అటు నేత‌లు, ఇటు ఉన్న‌తాధికారులపై కూడా ఈ జిల్లాల పెంపు తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. జిల్లాల పెంపుతో ఇప్ప‌టికే ఎస్సీ - ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు క‌నుమ‌రుగై.. జ‌న‌ర‌ల్ కేట‌గిరీలోకి చేరే ఛాన్సులు ఉన్నాయ‌ని... దీంతో ఎస్సీ నాయ‌కుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాలు ఒక‌టికి మించి రెండు మూడు జిల్లాల ప‌రిధిలోకి వెళ్తే.. ఎమ్మెల్యేలు ఆ రెండు మూడు జిల్లాల‌పైనా ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది. దీంతో వారి కాన్స‌న్‌ ట్రేష‌న్ దెబ్బ‌తిన‌డంతోపాటు.. జిల్లా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల ఏర్పాటు, తాగునీటి స‌మ‌స్య‌లు ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్ట‌నున్నాయి.

అదేవిధంగా పాల‌న ప‌రంగా చూసినా.. ఇప్పుడు ఒక  జల్లాలోనే నియోజ‌క‌వ‌ర్గం ఉంటేనే ప‌నులు అంతంత మాత్రంగా జ‌రుగుతుంటే... రేపు రెండు మూడు జిల్లాల ప‌రిధిలోకి ఒక నియోజ‌క‌వ‌ర్గం చేరితే.. అప్పుడు మ‌రింత‌గా అధికారుల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లుగా ఉన్న వారు ఇప్పుడు చిన్న జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లుగా ప‌ని చేయ‌డానికి పెద్ద ఆస‌క్తితో ఉండ‌ర‌నే అభిప్రాయం వ‌స్తోంది. అదేవిధంగా ఎస్పీల ప‌రిస్థితి కూడా ఉండ‌బోతోంది. ఎస్పీలు డివిజ‌న్ స్థాయి అధికారుల స్థాయికి దిగ‌జారిపోతారు. ఏదైనా క్రైం జ‌రిగిన‌ప్పుడు దానిని పూర్తిస్థాయిలో విచారించాలంటే.. రెండు మూడు జిల్లాల అధికారుల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది.

ఇక‌, పాలిటిక్స్ ప‌రంగా చూసినా.. కొన్ని జిల్లాల‌కు మంత్రులు కూడా ఉండే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక‌, సీఎం విష‌యానికి వ‌స్తే.. మాత్రం ఆయ‌నే స‌ర్వాధికారిగా మారే ప‌రిస్థితి ఉంటుంది. దీంతో ప్ర‌తి విష‌యానికీ ఆయ‌న వ‌ద్ద పంచాయితీ పెట్టేందుకు అధికారులు క్యూక‌డ‌తార‌ని తెలుస్తోంది. అయితే, అదే స‌మ‌యంలో పార్టీల‌కు కిందిస్థాయిలో కేడ‌ర్ బ‌లంగా ఉండే ప‌రిస్థితి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ప‌ద‌వులు రాలేద‌ని భావిస్తూ వ‌స్తున్న నేత‌ల‌కు జిల్లాల ఏర్పాటుతో ప‌దువులు ద‌క్కే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఏదేమైనా .. జిల్లాల ఏర్పాటు కొంత సంతోషాన్ని నింపుతుండ‌గా.. మ‌రికొంద ఆందోళ‌న‌ను రాజేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News