ఆ పదవి పోయినా.. మరో పదవి ఇస్తారట

Update: 2015-07-05 09:49 GMT
అధినేత కరుణా కటాక్షం ఉండాలే కానీ.. చట్టం ఊరుకున్నా.. ఊరుకోకున్నా దక్కాల్సిన గౌరవం అయితే దక్కకుండా మానదు. ఆ మధ్య పదవుల సర్దుబాటులో భాగంగా మంత్రి పదవులు ఇవ్వలేని వారికి.. మంత్రి పదవుల్లాంటి పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులను తెరపైకి తెచ్చి మరీ.. కొందరికి ఆ పోస్టులను కట్టబెట్టిన వైనం తెలిసిందే. పదవులు ఇచ్చే విషయంలో అన్న మాటను నిలబెట్టుకోవటానికి ఎంతకైనా తాను రెడీ అన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్లమెంటరీ సెక్రటరీల విషయంలో చెప్పకనే చెప్పేశారు.

అయితే.. కేసీఆర్‌ పదవుల పందేరంపై కస్సుమన్న విపక్షాలు.. కోర్టును ఆశ్రయించటం.. పార్లమెంటు కార్యదర్శుల పోస్టులు ఇవ్వటం సరికాదని చెబుతూ..వారిని ఆ పదవుల నుంచి తీసేయాల్సిందిగా కోర్టు ఆర్డర్‌ వేస్తూ.. తెలంగాణ సర్కారు నెత్తిమీద జెల్లకాయ వేయటం తెలిసిందే.

కోర్టు చెప్పటంతో పదవులు పోవటంపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్లమెంటు కార్యదర్శుల స్థానే మర పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి ఇచ్చే పదవులు ఎలాంటి చట్టబద్ధమైన చిక్కులు ఎదురుకాకుండా చూడాలని అధికారులకు చెప్పినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రూల్‌బుక్‌ ముందేసుకొని.. ఈ నేతలకు పదవులు ఇచ్చే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట.

ఇదంతా బాగానే ఉన్నా.. పదవులు అనుభవించి.. కోర్టు ఆదేశాలతో పదవులు పోయి.. దాని సౌకర్యాలు అందక.. చేతికి రావాల్సిన జీతాలు రాకపోవటంతో పార్లమెంటరీ కార్యదర్శులే కానీ.. వారి దగ్గర పని చేస్తున్న వారు తెగ ఫీలైపోతున్నారట. ఎంత కష్టం వచ్చిందో కదూ..!



Tags:    

Similar News