బీరు మీద పెంచింది రూ.10 కానీ కేసీఆర్ బాదుడికి ఖజానాకు వచ్చేదెంతంటే?

Update: 2022-05-20 02:21 GMT
చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేకుండా వ్యవహరించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త భిన్నమనే చెప్పాలి. పేరుకు ధనిక రాష్ట్రమే అయినా.. గడిచిన ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారీగా అప్పుల పాలైన రాష్ట్రం.. ఇవాల్టి రోజున నిధుల కోసం కటకటలాడే పరిస్థితి.

ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన వేళ.. మిగులు బడ్జెట్ తో ప్రయాణాన్ని ఆరంభించటం.. భారీగా ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ చెంతన ఉన్నప్పటికీ.. అప్పుల మీద అప్పులు చేసిన వైనం ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది.

అంతకంతకూ పెరుగుతున్న రెవెన్యూ లోటుతో పాటు.. ఖాళీ అయిన ఖజానాను కాసులతో నింపేందుకు అవకాశం ఉన్న ప్రతి దాని మీద బాదుడు బాదే ప్రోగ్రాంకు తెర తీశారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా తాజాగా మద్యం ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కో బీరు బాటిల్ మీద రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం.. లిక్కర్ మీద మాత్రం 20 శాతం ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.18 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.

రోజుకు రూ.18 కోట్లు అంటే.. పెరిగే అమ్మకాలతో కలిపితే దగ్గర దగ్గర రూ.20 కోట్ల ఆదాయం పెరగటం ఖాయమంటున్నారు. అంటే.. నెలకు రూ.600 కోట్ల చొప్పు.. ఏడాదికి రూ.7200 కోట్ల మేర ఆదాయం అదనంగా రానుంది. అదే సమయంలో అంతే మొత్తం ప్రజల జేబుల నుంచి ఖాళీ కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన మొదట్లో మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి ఇప్పుడు వచ్చే ఆదాయానికి ఏ మాత్రం పొంతన లేకపోవటం గమనార్హం.

2021-22లో అబ్కారీ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.31,059 కోట్లు కాగా.. 2022-23లో మరో రూ.2వేల కోట్ల ఆదాయం పెరిగి రూ.33 వేల కోట్ల వరకు వస్తుందని భావించారు.

తాజాగా పెంచిన ధరలతో అబ్కారీ శాఖద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.7వేల కోట్లకుపైనే అదనంగా రానుంది. దీంతో.. రాష్ట్ర ఖజానాకు ఏడాదికి అబ్కారీ శాఖ ద్వారా ఆదాయమే రూ.40వేల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం మద్యం అమ్మకాలతో వచ్చేదే కావటం గమనార్హం.
Tags:    

Similar News