తెలంగాణ ప్ర‌జ‌ల్ని మోసం చేసిన కేసీఆర్‌

Update: 2017-10-08 17:30 GMT
మాట మార్చ‌టంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. మాటల మాంత్రికుడిగా సుప‌రిచితుడైన ఆయ‌న‌.. అవ‌కాశాన్ని.. అవ‌స‌రానికి అనుగుణంగా మాట‌లు మార్చేయ‌టం ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా.  తెలంగాణ రాష్ట్రం కోసం జోరుగా ఉద్య‌మం సాగుతున్న వేళ‌లో ఎవ‌రికి సంబంధం లేని తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసిన‌ట్లుగా చెప్పుకోవ‌ట‌మే కాదు.. అన్ని రాజ‌కీయ పక్షాల‌ను ఒక వేదిక మీద‌కు తీసుకురావ‌టమే లక్ష్య‌మ‌న్న‌ట్లుగా చెప్పారు.

తీరా.. ఈ రోజున మాత్రం అందుకు భిన్నంగా.. తెలంగాణ రాజ‌కీయ జేఏసీకి క‌ర్త‌.. క‌ర్మ‌.. క్రియ మొత్తం తానేన‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత‌క‌ర్త జ‌య‌శంక‌ర్ సార్‌ను తొలుత జేఏసీ ఛైర్మ‌న్‌ గా అనుకున్నామ‌ని.. కానీ ఆయ‌న కాద‌న‌టంతో ఎవ‌రో ఒక‌రు ఉంటార‌న్న ఉద్దేశంతో కోదండ‌రామ్‌ ను ఎంపిక చేసిన‌ట్లుగా చెప్పారు.

తెలంగాణ ఉద్య‌మాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ల‌టం కోస‌మే తాను జేఏసీ ఆలోచ‌న చేసిన‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ మొత్తం త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకోవాల‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి. నిజానికి జేఏసీ విష‌యంలోనే కాదు.. చాలా విష‌యాల్లోనూ కేసీఆర్ అబ‌ద్ధాలు చెప్ప‌టం క‌నిపిస్తుంది.

త‌న త‌ల‌ తెగిప‌డినా కూడా అబ‌ద్ధాలు చెప్ప‌టం త‌న‌కు చేత‌కాద‌ని చెప్పే  కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే అన్న మాట‌ను చెప్ప‌టం.. ఆ మాటను ఎంత అందంగా చెప్పారో తెలిసిందే. అయితే.. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందో అప్ప‌టి నుంచి ఆయ‌న టోన్ లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించింది. చివ‌ర‌కు అంద‌రూ అనుకున్న‌ట్లే కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

అయితే.. సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టే వారు అనుభ‌వం ఉండాల‌న్న మాట ద‌గ్గ‌ర వ‌చ్చేస‌రికి.. కోట్లాడి సాధించిన తెలంగాణ ఎవ‌రో తెలీని వాళ్ల చేతుల్లో పెట్ట‌లేమంటూ గులాబీ ద‌ళం చేసిన వాద‌న‌ల్ని ప‌క్క‌న పెడితే.. చివ‌ర‌కు అనుకున్న‌ట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుర్చీలో కేసీఆరే కూర్చున్నార‌ని చెప్పాలి.

సీఎం కుర్చీ విష‌యంలోనూ.. తాజాగా తెలంగాణ రాజ‌కీయ జేఏసీ ఏర్పాటు వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని చెప్ప‌టం ద్వారా ఇంత‌కాలం తెర వెనుక గుట్టుగా ఉన్న విష‌యాలు ఒక్కొక్క‌టికి ర‌ట్టు అవుతున్నాయి. అయితే.. దీనంత‌టికి కార‌ణ‌మైన కేసీఆర్‌.. త‌న నోటి నుంచే నిజాల్ని చెప్పేయ‌టం మ‌రింత ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News