ఇక..శంషాబాద్ కాదు.. రంగారెడ్డి

Update: 2016-10-03 05:43 GMT
కొత్త జిల్లాలపై కసరత్తును మరింత వేగవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ అధికారపక్షానికి చెందిన మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధులతో ఆదివారం వరుస భేటీలు నిర్వహించిన ఆయన.. తన దృష్టికి ఇప్పటికే వచ్చిన అంశాలు.. పార్టీ నేతలు ప్రస్తావించిన అంశాలపై ఆయన స్పందించారు. దసరా నుంచి కొత్త జిల్లాల్ని అమల్లోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి.. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని తీసుకున్నట్లు చెప్పారు.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న వివిధ జిల్లాల పేర్లపై పార్టీ నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా.. శంషాబాద్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చాలన్న దానికి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొడంగల్.. బొమ్రాన్ పేట మండలాల్ని వికారాబాద్ జిల్లాలోకి చేర్చాలని.. దౌలతాబాద్ మండలాన్ని ఏ జిల్లాలోకి చేర్చాలన్న అంశంపై మరోసారి ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించినట్లుగా చెప్పారు.

శంషాబాద్ జిల్లాకు రంగారెడ్డి పేరుకు ఓకే అన్న కేసీఆర్.. వికారాబాద్ జిల్లాకు అనంతగిరి అన్నపేరు పెట్టే విషయం మీద జరిగిన చర్చకు మాత్రం మౌనంగా ఉండటం.. తన అభిప్రాయాన్ని వెల్లడించకపోవటం గమనార్హం. తెలంగాణ సమరయోధుడు కొండా వెంకటరంగారెడ్డి పేరును శంషాబాద్ కు పెట్టాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఆయనకు చెందిన స్వగ్రామం మొయినాబాద్ మండలం పెద్దమంగళారం శంషాబాద్ జిల్లాలో చేరుతున్న నేపథ్యంలో.. ఆ పేరు పెట్టాలన్న వినతికి సీఎం ఓకే చెప్పటమే కాదు.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా పార్టీ నేతలు ఎంపీ జితేందర్ రెడ్డి.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆత్మకూరు.. చిన్నచింతకుంట.. అమరచింత మండలాలపై వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న కేసీఆర్.. ఇష్యూలను వ్యక్తిగత ప్రతిష్టలతో ముడి పెట్టొద్దన్న మాట చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఎల్లారెడ్డి డివిజన్ ను కేంద్రం చేయాలన్న ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి విన్నపాన్ని ఓకే చేశారని.. జక్రాన్ పల్లి.. ఆర్మూర్ మండలాల మార్పులు చేర్పులపై చర్చ సాగినట్లుగా చెబుతున్నారు.   సంస్థాన్ నారాయణపురం మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలన్న వినతిపైనా సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో చేర్చాలని నిర్ణయించారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో దొమ్మరి పోచమ్మ పేరిట ఏర్పాటు కానున్న మండలానికి గండిమైసమ్మగా పేరు మార్చాలన్న మాటకు సీఎం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. సిద్ధిపేట జిల్లాలో కొమురవెల్లి మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News