జగన్ బాటలో కేసీఆర్.. ఇప్పుడు ‘లోకల్’ మాట అందుకేనా?

Update: 2020-08-06 06:50 GMT
పాలకులు ఉత్తినే ఏ నిర్ణయాన్ని తీసుకోరు. ఏదైనా విషయంలో ఒక అడుగు ముందుకు వేశారంటే.. దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయి. ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలంటూ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన విధివిధానాల్ని సిద్ధం చేశారు. ఏడాది క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే తరహాలో ప్రకటన చేశారు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒకలాంటి పోటీ ఉంటుంది. ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నంతనే.. దాన్నితమ రాష్ట్రంలోనూ అమలు చేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది.

అందుకు తగ్గట్లే.. వెంటనే కాకున్నా ఒకట్రెండు నెలల తేడాతో నిర్ణయం తీసుకోవటం అలవాటే. తాజాగా తీసుకున్న  స్థానికులకు ఉద్యోగాల్లో పెద్దపీట వేయాలన్న నిర్ణయం ఇప్పుడే ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారన్నది ఆసక్తికరంగా చెప్పాలి. తాజాగా ప్రకటించిన దాని ప్రకారం స్థానికులను ఎక్కువగా ఉద్యోగాలకు తీసుకునే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కాబినెట్ డిసైడ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించిన పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాల్ని అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

తాజాగా ప్రకటించిన విధానాన్ని చూస్తే..పరిశ్రమల్ని రెండు కేటగిరీలుగా విభజన చేశారు. మొదటి కేటగిరిలో వచ్చే పరిశ్రమల్లో.. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులకు కచ్ఛితంగా యాభై శాతం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి పరిశ్రమల్లో పాక్షిక నైపుణ్యం ఉన్న విభాగాల్లో 60 నుంచి 70 శాతం వరకు ఉద్యోగాల్ని స్థానికులకు కల్పించాలి. రెండో విభాగంలోకి వచ్చే పరిశ్రమల్లో స్కిల్డ్ వర్కర్లలో 60 శాతం మంది స్థానికులు.. సెమీ స్కిల్డ్ వర్కర్లు 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంది.

ఇంతకూ ఈ నిర్ణయం ఉన్నట్లుండి ఎందుకుతీసుకున్నట్లు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఎవరెన్ని చెప్పినా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇది సరిపోదన్నట్లు కరోనా పుణ్యమా అని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో.. ఖర్చుల్ని తగ్గించుకోవటం.. అవకాశం ఉన్న ప్రతిచోట ఖర్చును వాయిదా వేయాలని భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల వయోపరిమితిని 60 ఏళ్లకు కానీ.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 61 ఏళ్లకు కానీ పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన.

దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టుచివరి నాటికి దగ్గర దగ్గర 1500 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారని చెబుతున్నారు. ఒక్కొక్కరికి సరాసరిన రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా తక్కువలో తక్కువ 800 మంది వరకు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ ఖర్చుభారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచేస్తే.. ప్రభుత్వానికి చెల్లింపుల భారం కనిష్ఠంగా రెండేళ్లు.. గరిష్ఠంగా మూడేళ్లు ఉండదు.

అయితే.. ఇక్కడో చిక్కు ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ప్రకటిస్తే.. ఉద్యోగస్తులు సంతోషానికి గురవుతారు. కానీ.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కారాలు మిరియాలు నూరటం ఖాయం. ఇప్పటికే ఉద్యోగ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడి ఉందని విద్యార్థులు.. విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి వేళలో ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంటే.. వారు సంతోషించినా..యువత నుంచి తిప్పలు తప్పవు. అందుకే.. తొలుత యువతను ప్రసన్నం చేసుకోవటానికి వీలుగా.. స్థానికులకు ఉద్యోగాల్లో పెద్ద పీట వేయాలన్న కాన్సెప్టును తెర మీదకు తెచ్చినట్లుగా చెబుతున్నారు.

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో ఉన్న వారిని సంతోష పెట్టేలా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించి.. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని పెంచేలా నిర్ణయాన్ని ప్రకటించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే.. ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట వేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News