105 అభ్య‌ర్థుల జాబితా వెనుక వ్యూహం ఇదేన‌ట‌!

Update: 2018-09-07 05:21 GMT
ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లై.. నామినేష‌న్ల గ‌డువుకు ఒక్క పూట ముందు.. ఆ మాట‌కు వ‌స్తే కేవ‌లం గంట‌ల ముందు అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేయ‌టం.. అద‌రాబాద‌రాగా బీఫాంలు ఇవ్వ‌టం.. ఉరుకులు ప‌రుగులు పెట్టి నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌టం లాంటి స‌న్నివేశాలు అల‌వాటైన తెలుగు ప్ర‌జ‌ల‌కు.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు దాదాపు నెల ముందే  అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌టం ఒక ఎత్తు అయితే.. ఇంచుమించు 90 శాతం మంది అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌టం కొత్త అనుభ‌వం కింద‌నే చెప్పాలి.

అసెంబ్లీని ర‌ద్దు చేసిన గంటలోపే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను కేసీఆర్ ఎందుకు ప్ర‌క‌టించార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అన్ని పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం 105 మంది అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల వెనుక వ్యూహాన్ని చూస్తే.. బ‌హుముఖ కోణాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

అభ్య‌ర్థుల జాబితాను భారీగా విడుద‌ల చేయ‌టం ద్వారా.. ప్ర‌స్తుతానికి సానుకూల వాతావ‌ర‌ణాన్ని పార్టీలో వ‌చ్చేలా చేశార‌ని చెప్పాలి. సిట్టింగ్‌ల‌ను కాద‌ని టికెట్లు కోరుకునే ఆశావాహులు కొద్దిమందే ఉంటారు. ఉన్న సిట్టింగులంద‌రికి సీట్లు ఇచ్చేయ‌టం ద్వారా పార్టీలో ఒక‌లాంటి పాజిటివ్ అప్రోచ్ లో అధినేత వెళ్లార‌న్న సాఫ్ట్ కార్న‌ర్ ఉంటుంది.

దీంతో టికెట్లు రాలేద‌న్న పంచాయితీలు.. గొడ‌వ‌లు.. ఆందోళ‌న‌లు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోకి జంపింగ్ లు.. స్వ‌తంత్రంగా పోటీ చేసే ఆలోచ‌న‌లు చేయ‌టం.. రెబెల్స్ త‌ల‌నొప్పి లేకుండా చూసుకోవ‌టం లాంటి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ట్లుగా చెప్పాలి.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. సిట్టింగుల‌కు సీట్లు ఇవ్వ‌టం ద్వారా..  అభ్య‌ర్థుల‌ను చూసి కాదు.. కేసీఆర్ ను చూసి ఓట్లు వేయాల‌న్న సందేశాన్ని ఇచ్చిన‌ట్లు అవుతుంది. అభ్య‌ర్థుల మంచిచెడ్డ‌లు క‌నుమ‌రుగైపోయి.. ఎన్నిక‌లు మొత్తం త‌న చుట్టూ తిరిగేలా చూడాల‌న్న‌దే కేసీఆర్ ప్లాన్ గా చెప్పాలి.

సిట్టింగుల‌కు ఇంత భారీగా సీట్లు కేటాయించ‌టం ద్వారా అనుకోని రీతిలో 30.. 40 స్థానాల్లో ఎదురుదెబ్బ తగిలినా ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి 61 మంది ఎమ్మెల్యేలు చాలు. ఎంత వ‌ర‌స్ట్ గా చూసుకున్నా ఈ మేజిక్ ఫిగ‌ర్ ను చేరుకోవ‌టం కేసీఆర్ కు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఒక‌వేళ‌.. తేడా వ‌చ్చినా ఆదుకోవ‌టానికి ఏడుగురు ఎమ్మెల్యేల్ని ప‌క్కాగా గెలిపించుకునే మ‌జ్లిస్ ఉండ‌నే ఉంది. అది కూడా కాద‌నుకుంటే.. కేసీఆర్ కు బాగా అల‌వాటైన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఉండ‌నే ఉంది. అందుకే.. అసంతృప్తిలు.. అల‌క‌లు.. నిర‌స‌న‌లు లాంటి ఇంటిపోరుకు చెక్ పెట్టేందుకే 105 మంది జాబితాను ఒకేసారి విడుద‌ల చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

జాబితా విడుద‌ల‌లో మ‌రో వ్యూహం కూడా ఉంద‌ని చెప్పాలి. ఇంత భారీ స్థాయిలో జాబితా విడుద‌ల అవుతుంద‌న్న విష‌యం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో స‌హా.. మంత్రుల‌కు కూడా తెలీద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇంత భారీ స్థాయిలో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న గులాబీ ద‌ళానికే పెద్ద స‌ర్ ప్రైజ్ గా మారింది. వారికే అంత షాకింగ్ గా ఉంటే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఎలా ఉంటుంది.

కేసీఆర్ లాంటి జెయింట్ ను దెబ్బ కొట్టాలంటే.. ఒక్క పార్టీకి సాధ్యం కాదు. అలా అని కేసీఆర్ వ్య‌తిరేక కూట‌మి ఏర్ప‌డాలంటే అందుకు బోలెడంత క‌స‌రత్తు జ‌ర‌గాలి. అలాంటి ప‌రిణామాల‌పై విరుచుకుప‌డ‌టంతో పాటు.. మ‌రోవైపు త‌న అభ్య‌ర్థుల విజ‌యం కోసం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌టం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అంత‌కంత‌కూ చెమ‌ట‌లు ప‌ట్టించే విష‌యంలోనూ కేసీఆర్ ప‌ద‌డుగులు ముందు ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే.. కేసీఆర్ కు కావాల్సింది కూడా.  


Tags:    

Similar News