కేసీఆర్ తాజా ప్ర‌క్షాళ‌న వ్యూహం ఇదేన‌ట‌!

Update: 2017-08-27 04:57 GMT
ప్ర‌కృతికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కొన్ని పోలిక‌లు క‌నిపిస్తాయి. ఒక సీజ‌న్ త‌ర్వాత మ‌రొక సీజ‌న్ వ‌స్తుంది. అదే రీతిలో సీఎం కేసీఆర్ ఒక విషయం త‌ర్వాత మ‌రో విష‌యాన్ని టేక‌ప్ చేస్తుంటారు. ఎండాకాలం త‌ర్వాత వానాకాలం.. ఆ త‌ర్వాత శీతాకాలం. ఇలా ఒక‌టి దాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌స్తుంటుంది. కాక‌పోతే.. ఇక్క‌డ చిన్న తేడా ఏమిటంటే.. రుతువులు వ‌చ్చిన‌వే వ‌స్తుంటాయి. కేసీఆర్ ఇష్యూలో మాత్రం ఆయ‌న టేక‌ప్ చేసిన ఇష్యూ త‌ర్వాత వచ్చేదంటూ  ఉండ‌దు.  రెండింటి మ‌ధ్య అదే తేడా.

ఇంటింటికి నీరు.. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌.. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు..  ఇలా ఒక కార్య‌క్ర‌మం త‌ర్వాత మ‌రో కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుంటారు సీఎం కేసీఆర్‌. ఇలా.. ప‌థ‌కాలు చేప‌ట్టే ఆయ‌న వివిధ కార్య‌క్ర‌మాల్ని కూడా నిర్వ‌హిస్తుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ప‌చ్చ‌ద‌నంతో వెల్లివెరిసేలా కోట్లాది మొక్క‌ల్ని నాటే కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. తాను చెప్పిన‌ట్లుగా మొక్క‌లు నాటారా?  లేదా? అన్న విష‌యాన్ని చెక్ చేసేందుకు తాను బ‌స్సు వేసుకొని మ‌రీ వెళ‌తాన‌ని ఒక‌సారి.. కాదు.. హెలికాఫ్ట‌ర్ వేసుకొని చూసి వ‌స్తాన‌ని చెప్పారు. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ప‌ని చేయ‌క‌పోవ‌టం మ‌రో విష‌యం.

కేసీఆర్ లో  మెచ్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. తాను షురూ చేసిన ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు ఎంత‌మేర పూర్తి అయ్యాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడుతూ.. ఒక కార్య‌క్ర‌మం త‌ర్వాత మ‌రో వినూత్న‌మైన కార్య‌క్ర‌మాన్ని తెర మీద‌కు తీసుకొస్తుంటారు. మొన్న‌టి వ‌ర‌కూ గొర్రెల పంపిణీ.. సామూహిక వ్య‌వ‌సాయం లాంటి వెరైటీ కాన్సెప్టుల‌ను చెప్పిన ఆయ‌న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స‌మ‌గ్ర భూ స‌ర్వే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

అప్పుడెప్పుడో నిజాం కాలం నాటి భూముల రికార్డులే నేటికీ ఉన్నాయ‌ని.. దీంతో ఎవ‌రి భూములు ఎవ‌రి పేర ఉన్నాయో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఉంద‌ని.. భూ రికార్డులు ప్ర‌క్షాళ‌న చేయ‌కుంటే ఆ వివాదాల‌ను తీర్చ‌లేమ‌ని ఆయ‌న చెబుతున్నారు. రికార్డుల ప్ర‌క్షాళ‌న‌తో బినామీలు బ‌య‌ట‌ప‌డ‌తార‌ని.. బినామీల తాట తీయ‌టానికి.. ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవ‌టానికి వీలుగా తాజా భూ ప్రక్షాళ‌న కార్య‌క్ర‌మం సాయంగా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఒక రాష్ట్రం మొత్తం స‌మ‌గ్ర భూస‌ర్వే అంటే మాట‌లు కాదు. మ‌రి అంత పెద్ద కార్య‌క్ర‌మాన్ని ఎలా నిర్వ‌హిస్తార‌న్న డౌట్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఇలాంటి కార్య‌క్ర‌మాల్ని ప్ర‌క‌టించ‌టానికి ముందు భారీ ఎత్తున కేసీఆర్ క‌స‌ర‌త్తు చేయ‌టం.. దాన్ని ఎంత సింఫుల్ గా పూర్తి చేయొచ్చో చెప్పేందుకు వీలుగా ఆయ‌న సిద్ధం కావ‌టం మామూలే.

తాజా స‌మ‌గ్ర భూస‌ర్వే విష‌యంలోనూ ఇదే వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు కేసీఆర్‌. తాజాగా నిర్వ‌హించే స‌మ‌గ్ర భూస‌ర్వేలో ప్ర‌జాప్ర‌తినిధులంద‌రిని భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు అయితే.. ప్ర‌జాప్ర‌తినిధులు ఎలా రోల్ ప్లే చేయాలో కేసీఆర్ వివ‌రంగా చెప్పుకొచ్చారు.

వ‌చ్చే ఏడాది ఖ‌రీఫ్ నుంచి ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌నున్న రైతుల‌కు పెట్టుబ‌డి ప‌థ‌కం స‌క్సెస్ కావాల‌న్నా.. నిజ‌మైన రైతులు ల‌బ్థి పొందాలంటే భూరికార్డుల ప్ర‌క్షాళ‌న చాలా అవ‌స‌రంగా చెబుతున్న కేసీఆర్‌..  రికార్డుల ప్ర‌క్షాళ‌నను విజ‌య‌వంతంగా పూర్తి చేసేందుకు వెయ్యి మంది డాటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల‌ను నియ‌మిస్తామ‌ని.. ఐదు వేల ఎక‌రాల‌ను ఒక క్ల‌స్ట‌ర్ గా విభ‌జించి..ఒక్కో క్ల‌స్ట‌ర్‌కు ఒక్కో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారిని ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అంతేనా.. 2500 క్ల‌స్ట‌ర్ల‌కు ఒక రైతు భ‌వ‌న్ ను నిర్మిస్తామంటున్నారు. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ ప్లానింగ్ అదిరిపోయేలా ఉంది క‌దూ. మ‌రి.. మాట‌ల్లో ఇంత బాగా ఉన్న ప్లాన్‌.. చేత‌ల్లో ఎంత‌మేర స‌క్సెస్ అవుతుందో చూడాలి.


Tags:    

Similar News