కేసీఆర్ విడిది కేంద్రం ఇక మండల కేంద్రం ?

Update: 2016-07-04 08:07 GMT
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నది పాత సామెత.. కేసీఆర్ తలచుకుంటే కొత్త మండలాలు కరువా? అంటున్నారు. స్థాయి.. అనుకూలత వంటి విషయాలతో సంబంధం లేకుండా తనకు నచ్చితే చాలు జిల్లా, మండలాలు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటులో సిరిసిల్ల జిల్లాను చేయడం... అలాగే జనగామకు నీటి సౌకర్యం లేకుండా చుట్టూ ఇతర జిల్లాలు ఏర్పాటు చేయడం వంటి విమర్శలు వచ్చాయి. మండలాల విషయంలోనూ కేసీఆర్ తనకు నచ్చినట్లు చేసుకుపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ విడిది కేంద్రంగా మారిన ఆయన ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లిని మండల కేంద్రం చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లినే ఆయన  దత్తత తీసుకున్నారు కూడా. ఇప్పుడు దాన్ని మండల కేంద్రం చేసి మరింత డెవలప్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు శనివారం నుంచి ఫాంహౌస్ లోనే ఉన్న కేసీఆర్ అక్కడ మెదక్ జిల్లా కలెక్టరు రోనాల్డ్ రాస్ తో దీనిపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష జరిపినట్లు చెబుతున్నప్పటికీ.. చర్చలన్నీ ఎర్రవల్లిని మండల కేంద్రం చేయడం గురించే అని తెలుస్తోంది.

ఎర్రవల్లిని మండల కేంద్రంగా మార్చే విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్న పక్షంలో దాని స్థానంలో ములుగు మండలం మర్కుక్ గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా మారిపోతున్న నేపథ్యంలో ఎర్రవల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయటంపై కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. దానిపై విమర్శలు రాకుండా సరైన కారణాలతో ఎర్రవెల్లిని మండల కేంద్రం చేయాలని కేసీఆర్ తలపోస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి కేసీఆర్ ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Tags:    

Similar News