చంద్రబాబు పవన్ ల ఆశలకు బ్రేకులేస్తున్న కేసీయార్...?

Update: 2022-12-12 03:31 GMT
వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అన్న ధీమాతో టీడీపీ ఉంది. ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే వైసీపీని బంగాళాఖాతంలో పడేసి తమనే పీఠం మీద కూర్చోబెడతారు అని తెలుగుదేశం ధీమాగా ఉంది. వైసీపీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అంచనా కడుతోంది. ఇక ఎన్నికల వేళకు పొత్తులు కురురుతాయి కాబట్టి అంతా సవ్యంగానే సాగుతుందని లెక్కలేసుకుంటోంది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి విడిగా పార్టీలు పోటీ చేయడమే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక అవగాహన ఉంది. దాంతోనే ఆయన ఈసారి వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో  చూస్తామని పదే పదే అంటున్నారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఆయన గంభీరమైన ప్రకటనలు కూడా చాలా సార్లు చేశారు.

అయితే ఈ మధ్య ప్రధాని మోడీతో కలిసిన తరువాత కాస్తా నెమ్మదించారు. ఎన్నికల వేళకు పొత్తులు చూసుకోవచ్చు ముందు పార్టీ సంగతి చూద్దామని ఆయన ఆలోచిస్తున్నారు. ఎవరేమనుకున్నా 2024 ఎన్నికల ముందు జనసేన టీడీపీల మధ్య పొత్తు కచ్చితంగా కుదురుతుంది అని అంటున్నారు. అదే జరిగితే ఏపీలో వైసీపీ దారుణంగా నష్టంపోతుంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఇపుడు వైసీపీకి అలా కాకుండా రక్షణ కవచంగా బీయారెస్ రూపంలో కేసీయార్ ఏపీలో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఏపీలో ఆరు శాతం ఓట్లే లక్ష్యంగా బీయారెస్ రంగంలోకి దిగబోతోందని అంటున్నారు. జాతీయ పార్టీగా బీయారెస్ అవతరించాలీ అంటే ఏపీలో ఆరు శాతం ఓట్లు దక్కించుకోవడం తప్పనిసరి అంటున్నారు. ఇక ఏపీ రాజకీయం అంటే కుల సమీకరణలే. అందువల్లనే కేసీయర్ మొదట నుంచే ఆ వైపుగా బీయారెస్ ని నడిపిస్తున్నారు అని అంటున్నారు.

ఏపీలో బీయారెస్ కి సారధిగా ఎవరిని నియమిస్తారో తెలియదు కానీ కచ్చితంగా బలమైన కులానికి చెందిన వారినే తీసుకుంటారు అని అంటున్నారు. అదే సమయంలో బీయారెస్ వ్యవహారాలు చూడడానికి సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని ఏపీకి పంపుతున్నారు. ఆయన నాయకత్వంలో పర్యవేక్షనలో బీయారెస్ రాజకీయ కార్యకలాపాలు ఏపీలో సాగుతాయని అంటున్నారు.

ఏపీలో తలసాని సామాజికవర్గం ఎక్కువ. అలాగే కేసీయార్ సామాజిక వర్గం కూడా కీలకంగా మారబోతోంది. దీంతో పాటుగా రాజకీయ ఆశావహులను కూడా దగ్గర చేర్చుకుంటే తాము అనుకున్న టార్గెట్ ని రీచ్ అవవచ్చు అన్నదే బీయారెస్ పెద్దల ఎత్తుగడ అని అంటున్నారు. ఏపీలో అమీ తుమీ తేల్చుకోవడానికే కేసీయార్ చూస్తారు. పైగా అర్ధ బలం, అంగబలం పూర్తిగా పెట్టి మరీ ఏపీలో పోరాడుతారు. దాంతో ఏ విధంగా చూసుకున్నా వైసీపీ వ్యతిరేక ఓటు భారీగా చీల్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

ఇక ఏపీని విడగొట్టిన పార్టీగా ముద్ర ఉన్నా దాన్ని తుడిపేసుకోవడానికి కేసీయార్ ముందుగా కర్నాటక నుంచే నరుక్కురావాలని చూస్తున్నారు. ఆ విధంగా ఆయన జాతీయ పార్టీ ముద్రతోనే ఏపీలో కాలు పెడతారు అని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో బీయారెస్ అనుకుంటున్నట్లుగా అయిదారు శాతం ఓట్లను చీలిస్తే చాలు వైసీపీ సులువుగా గట్టెక్కిపోతుంది అని లెక్కలు చెబుతున్నారు. ఆ మేరకు విపక్షాలు లాభపడకుండా బీయారెస్ మధ్యన అడ్డుగోడ కడితే రెండవసారి వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు.

ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు జీర్ణించుకోలేనివే అని అంటున్నారు. ఒక జాతీయ పార్టీగా బీయారెస్ ఏపీలో పోటీ చేయడాన్ని వారు ఏ విధంగానూ కట్టడి చేయలేరు. పోనీ పొత్తు పెట్టుకుందామా అంటే దాని వల్ల వచ్చే లాభాలు తెలియవు, నష్టాలు ఉంటాయన్న బెంగ ఉంది. అలా కాకుండా బీయారెస్ ని దాని మానాన వదిలేస్తే మాత్రం ఏపీలో వైసీపీకి వరంగా తమకు శాపంగా మారుతుంది అన్న బెంగ అయితే మొదలైందిట. మరి రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబు ఏ విధంగా ఈ బీయారెస్ ఉపద్రవాన్ని ఎదుర్కొంటారో చూడాలని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News