మీరు తయారు చేసి..అల్లుడికి అభినందనలేంటి సార్?

Update: 2020-03-08 11:11 GMT
సోషల్ మీడియా పుణ్యమా అని రహస్యాలేమీ లేవు ఇప్పుడు. అందరికి తెలిసిన రహస్యం.. కొంతమందికి మాత్రమే తెలిసిన రహస్యాలు మాత్రమే ఉన్నాయి. అంతా ఓపెన్ అయ్యాక కూడా.. కొన్ని మాటలు అతికినట్లుగా ఉండవు సరికదా.. కామెడీగా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురైందని చెబుతున్నారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టింది ఆర్థికమంత్రి హోదాలో ఉన్న హరీశ్ రావు అయినప్పటికీ.. దానికి సంబంధించిన పక్కా ప్లాన్ మొత్తం సీఎం కేసీఆర్ కనుసన్నల్లో జరిగిందన్న మాట అధికార పక్షంలో ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. ఆర్థికమంత్రి కుర్చీలో ఎవరు కూర్చున్నా.. నిధుల పంపకాలు.. ఏ శాఖకు ఎంత కేటాయింపులు జరపాలి? ఎవరికి ఎలాంటి హామీ ఇచ్చాం.. దానికి అనుగుణంగా ఏమేం చేయాలన్న విషయాలన్ని సారు చెప్పినట్లు చేయాలన్న విషయం తెలిసిందే.

ఆ మధ్యన మూసీని మార్చేసేందుకు మస్తు పైసలు ఇస్తానని చెప్పిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే ఊహించని రీతిలో రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఒక ప్రాజెక్టు కోసం ఇంత భారీగా నిధులు ఇచ్చింది ఇప్పుడేనని చెప్పక తప్పదు. ఇతర కేటాయింపులు చూస్తే.. అన్ని కేసీఆర్ ప్రాధాన్యతకు తగ్గట్లే ఉన్నాయి. ఆ మాటకు వస్తే.. ఆయన కోరుకున్న రీతిలో బడ్జెట్ అంచనాల్ని రూపొందించారని చెప్పక తప్పదు.

ముందే తెలిసిన బడ్జెట్ గురించి.. సభలో ప్రవేశ పెట్టిన తర్వాత.. ఆర్థికమంత్రిని పొగిడేయటం.. ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారంటూ ఆర్థిక మంత్రిగా ఉన్న మేనల్లుడిని కేసీఆర్ అంతలా పొగిడేయటం అతికినట్లు ఉంటుందంటారా? అన్నింట్లోనూ అప్డేట్ అయ్యే కేసీఆర్ సారు.. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకు వెనుకబడి ఉంటారంటారా?


Tags:    

Similar News