హరీశ్ ఎంత మొనగాడో చెప్పిన కేసీఆర్

Update: 2016-10-11 15:39 GMT
పొగడటం కేసీఆర్ కు కొత్తేం కాదు. కానీ.. అయిన వాళ్ల గురించి ఆయన పెద్దగా ప్రస్తావించరు. తన కుమారుడు.. మంత్రి కేటీఆర్ గురించి కానీ.. తన మేనల్లుడు కమ్ మంత్రి అయిన హరీశ్ రావు గురించి కానీ.. వారి గొప్పతనం గురించీ ఆయన పెద్దగా ప్రస్తావించరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సి వస్తే.. తెలంగాణ అధికారపక్షంలో ఇంత మంది నేతలు ఉన్నప్పటికీ.. హరీశ్.. కేటీఆర్ సామర్థ్యానికి దరిదాపుల్లోకి వచ్చే నేతల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. హరీశ్.. కేటీఆర్ పని తీరు విషయంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నప్పటికీ ఆ విషయంపై ఆయన గుంభనంగా ఉంటారు.

అలాంటి కేసీఆర్ తాజాగా కాస్తంత ఓపెన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల్ని ప్రారంభిస్తున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని సిద్ధిపేట అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాసింత భావోద్వేగంతో మాట్లాడారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన సిద్ధిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లే సమయంలో తన రెండు కళ్లల్లో నీళ్లు తిరిగినట్లుగా చెప్పిన కేసీఆర్.. సిద్ధిపేట ఏమవుతుందోనని తాను బాధ పడినట్లుగా వెల్లడించారు.

అయితే.. హరీశ్ రావు తనకు ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే కాదు.. సిద్ధిపేటను స్వర్గసీమ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేటను హరీశ్ కోరుకున్నట్లుగా అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల ఆర్థిక సాయంతో పాటు.. వచ్చే ఏడాది ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేటలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని.. ఈ ప్రాంతంలో అద్భుతమైన భవనాలు వస్తాయని.. పట్టణానికి నాలుగు మూలలా కలెక్టర్.. ఎస్పీ.. కోర్టుల సముదాయం.. జెడ్పీ భవనాలు వచ్చేలా చేయాలని సూచించారు.

హరీశ్ కు తన ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని చెప్పిన కేసీఆర్.. ఆయన పని తీరును విపరీతంగా పొగిడేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి గొప్ప పరిపాలనా సంస్కరణలు సిద్ధిపేట నుంచి ప్రారంభం కావటం తాను ఎప్పటికీ మర్చిపోలేనని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News