బీజేపీని దెబ్బేసే ఛాన్సు వస్తే కేసీఆర్ ఇంతలా రియాక్టు అవుతారా?

Update: 2021-03-31 04:36 GMT
తనకు తిరుగులేని తెలంగాణలో.. ఇబ్బందికర పరిస్థితులకు కారణమైన బీజేపీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతలా రగిలిపోతున్నారన్న విషయాన్ని తెలియజేసే ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి.. భంగపడిన అంజయ్య పార్టీ మీద రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్.. అంజయ్యను పార్టీలోకి చేర్చే విషయంలో ప్రదర్శించిన ఉత్సాహం.. దూకుడు ఆసక్తికరంగా మారాయి.

సాధారణంగా కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకాలంటే మంత్రులకే దొరకని పరిస్థితి. అందునా.. ప్రగతిభవన్ నుంచి ఫాంహౌస్  లో ఉన్న వేళలో.. అక్కడికి వెళ్లటం.. సారును కలవటం.. ఆయనతో మాట్లాడం మామూలు వారికి సాధ్యమయ్యేది కాదు. కానీ.. సాగర్ ఉప ఎన్నిక వేళ కావటంతో.. కొన్ని విషయాలకు కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయం తాజాగా అర్థమయ్యేలా చేసింది.

అంజయ్య అంత తీసిపడేసే నేత కాదు. సాగర్ నియోజకవర్గంలో ఆయనకంటూ ఫాలోయింగ్ ఉంది. అందుకే.. టికెట్ కోసం ఆశించి.. భంగపడ్డారన్న విషయం తెలిసినంతనే పావులు కదిపిన కేసీఆర్.. వెంటనే ఆయనతో భేటీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ లో బీజేపీ డిపాజిట్ కోల్పోతే.. టీడీపీ తరఫున పోటీ చేసిన అంజయ్య 27,858 ఓట్లను సాధించిన ఎన్నికల బరిలో మూడో స్థానంలో నిలిచారు.

ఇదే అంశం కేసీఆర్ ను విపరీతంగా ఆకర్షించటమే కాదు.. బీజేపీని దెబ్బ తీసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని తాను విడిచిపెట్టనన్న విషయాన్ని తాజా ఎపిసోడ్ తో అర్థమయ్యేలా చేశారు. టికెట్ రాకపోవటంతో అంజయ్య ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న గులాబీ నేతలకు సారు నుంచి ఫోన్ రావటంతో.. ఆయనతో మంతనాలు జరిపారు. అధినేత కసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక ఉంటుందన్న విషయం ఆయనకు చెప్పినంతనే ఓకే చెప్పారు.

కేసీఆర్ కు రాజకీయ అవసరం ఉన్న వేళలో.. ఆయన కోరినట్లే గులాబీ కారులో ఎక్కేస్తే..తన భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదని భావించిన అంజయ్య పార్టీలో చేరారు.ఆయన్ను తీసుకొని ప్రగతిభవన్ కు వెళ్లిన అధికార పార్టీ నేతలకు.. తాను ఫాంహౌస్ లో ఉన్నానని.. అక్కడికి రావాలని చెప్పిన కేసీఆర్.. చెప్పినట్లే ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదంతా చూస్తే.. బీజేపీని దెబ్బేయటం కోసం కేసీఆర్ ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. సాగర్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ఇంతలా అప్రమత్తంగా ఉంటే.. కమలనాథులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్సు తో ఉండి.. తమ బలాన్ని బలహానతగా మార్చుకుంటున్నారని చెప్పక తప్పదు. ఇదే తీరులో టీబీజేపీ నేతల తీరు కొనసాగితే.. సాగర్ లో భారీ షాక్ తప్పదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News