అస‌మ్మ‌తులపై...గులాబీ రాష్‌ గేమ్!

Update: 2018-09-28 11:30 GMT
" టిక్కట్లు రాని వారిని కడుపులో పెట్టుకుంటాం"

" అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి మంచి అవకాశాలు ఇస్తాం "

" పార్టీ టిక్కట్లు ఇచ్చిన వారందరిని గెలిపించి తీరాలి"

ఇవి శాసనసభ రద్దుతో పాటు 105 మంది అభ్యర్ధుల జాబితాను స్రకటించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్న మాటలు. ఇలా ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి జ్వాలలు తగ్గలేదు సరి కదా రానురాను మరింత పెరుగుతున్నాయి. ఈ అసంతృప్తులను బుజ్జగించాలని పార్టీ సీనియర్ నాయకులకు బాధ్యతలు కూడా అప్పగించారు పార్టీ అధినేత. అయితే ఇది కూడా సత్ఫలితాలు ఇవ్వలేదంటున్నారు.

సీనియర్ నాయకుల బుజ్జగింపులు విన్న ఆశావాహులు అప్పటికి సరే అన్నా.... ఆ తర్వాత మాత్రం నియోజకవర్గాల్లో తమ పని తాము చేసుకుంటున్నట్లు పార్టీకి సమాచారం అందినట్లు చెబుతున్నారు. గడచిన నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకున్న తమను కాదని - ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా సిట్టింగులకే టిక్కెట్లు కేటాయించడంతో వారంతా రగిలిపోతున్నారు. దీంతో ఎలాగైనా తమ పార్టీకి చెందిన అభ్యర్ధుల ఓటమి కోసం పని చేయాలని కొందరు తీవ్రంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ విషయం ఇంటిలిజెన్సీ విభాగం నుంచి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధిక్కాన నేతలపై వేటు వేసేందుకు కూడా సిద్ధం కావాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ప్రకటించిన అభ్యర్ధులు - వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి వివరాలను ఇంటిలిజెన్సీ విభాగం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినట్లు చెబుతున్నారు.

మహాకూటమి పేరుతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న వేళ కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ విజయం సాధించడం కష్టమని అధిష్టానం భావిస్తోంది. దీంతో అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని ముందుగానే గుర్తించి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అసమ్మతి నేతలకు మరోసారి వివరించి చెప్పాలని - వారు ఇంకా మొండి వైఖరితోనే వ్యవహరిస్తే పార్టీ నుంచి బహిష్కరించడమే  పరిష్కారమని అంటున్నారు. ఈ వేటు దశను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News