పండక్కి 15 కోట్లు స‌రే..ప్రాణాల మాటేంది?

Update: 2016-10-03 07:49 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు కొన్ని చాలా సిత్రంగా ఉంటాయి. చేతికి ఎముక లేనట్లుగా నిధుల విడుదలకు పచ్చజెండా ఊపే ఆయన.. కొన్నింటికి నిధులు ఇవ్వటానికి ఏ మాత్రం ఆసక్తి కనిపించని వైనం కనిపిస్తుంది. బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించటం కోసం ఆయన రూ.15 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పండగగా ఉన్న బతుకమ్మకు ఆ మాత్రం నిధులు ఇవ్వటం తప్పేం కాదు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం లాంటి పండగను ప్రమోట్ చేయటం తప్పేమీ కాదు.

పండగ ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి ప్రాణాలతో పోలిస్తే.. పండగ పెద్దదేం కాదు. అంతా బాగున్నప్పుడు చేసుకునేది పండగ. ఓపక్క సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా.. అనారోగ్యంతో ఇల్లు మొత్తం బాధలో ఉన్నప్పుడు పండగ చేసుకునే ఛాన్సే ఉండదు. ఇంటి లెక్క ఎలానో.. రాష్ట్రం లెక్క కూడా అంతే అవుతుంది. అదెలా అంటారా? అక్కడికే వస్తున్నాం. బడుగు.. బలహీన వర్గాలకు మాత్రమే కాదు.. దిగువ మధ్యతరగతి కుటుంబాల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ పథకం సంజీవిని లాంటిది.

ఈ పథకంలో లోపాలు ఉండటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. లోపాల్ని ఒక త్రాసులో.. దాని వల్ల కలిగే ప్రయోజనాన్ని మరో త్రాసులో వేస్తే.. సామాన్యుల ప్రాణాలకు అండగా నిలవటమే కాదు.. ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే వారికి ప్రత్యక్ష దైవంగా కనిపించే ఆరోగ్యశ్రీ పథకం ఎంతో కీలకమైంది. దురదృష్టవశాత్తు ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పెద్దగా ఫోకస్ చేయని పరిస్థితి. తాజాగా చూస్తే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.450 కోట్ల మేర ఉన్నాయి. వాటిని చెల్లించని ప్రభుత్వ తీరుతో.. ఆరోగ్యశ్రీసేవల్ని బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ధనిక రాష్ట్రంగా గొప్పలు చెప్పుకునే తెలంగాణ సర్కారు.. తన రాష్ట్రంలోని బడుగు బలహీన ప్రజానీకానికి అవసరమైన కీలక వైద్య సేవల్ని సైతం అందించలేని దుస్థితిలో ఉండటం దేనికి సంకేంతం. ఓపక్క పండగల్ని ఘనంగా చేసుకోవటానికి కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టేందుకు వెనుకాడని ప్రభుత్వం.. ప్రజల ప్రాణాల్ని కాపాడే ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి నిధులు ఎందుకు కేటాయించదన్నది కీలక ప్రశ్న. పండక్కి ఇచ్చే విలువ కంటే ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తే కొన్ని ప్రాణాలు ఆయన పేరు చెప్పుకొని నిలుస్తాయనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News