ఆ పోస్ట్ మీకలా అర్థమైందా కేసీఆర్..?

Update: 2016-09-25 17:30 GMT
తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే సోషల్ మీడియా పోస్టింగ్ లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా ఫాలో అవుతున్న విషయం తాజా ఎపిసోడ్ తో అర్థమైంది. కేసీఆర్ కు సంబంధించి ఈ కోణం ముందే తెలిసినా... ఇపుడు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. వాట్సప్.. ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నేసిన వైనం తాజాగా ఆయన ప్రదర్శించిన ఆగ్రహం సందర్భంగా స్పష్టమైంది. తాజాగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. ఆయన సర్కారు తీరుపై భారీగానే పోస్టింగ్ లు పోస్ట్ అయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా కేసీఆర్ ప్రస్తావించటమే కాదు.. వెకిలిగా ఉన్నాయంటూ మండిపడ్డారు కూడా.

తనను నొప్పించే విధంగా ఉన్న పోస్టుల మీద ఫైర్ అయిన ముఖ్యమంత్రి.. తన వాదనకు తగ్గట్లుగా ఉన్న పోస్టుల మీద స్పందించిన తీరును గుర్తించాల్సిందే. ప్రతి ఇంటికి నీళ్లు తెస్తానంటూ కేసీఆర్ మాటల్ని తాజాగా కురిసిన వర్షం కారణంగా ఇళ్లల్లోకి వచ్చిన నీళ్లను చూపిస్తూ పెట్టిన పోస్టులపై సీరియస్ అయిన కేసీఆర్.. అదే సమయంలో.. ‘‘మా చెరువుల్లోకి మీ ఇండ్లు వచ్చాయి. అందుకే.. మీ ఇండ్లల్లోకి మా నీళ్లు వచ్చాయి’’ అంటూ పెట్టిన పోస్టింగ్ కేసీఆర్ ను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా జరిగిన రివ్యూ మీటింగ్ సందర్భంగా ఈ పోస్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేసీఆర్.. ఈ పోస్ట్ బాగుందని.. దీన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలని.. బాగా ప్రచారం చేయాలన్నారు. చెరువుల ఆక్రమణలు ఒక్కరోజులో రాలేదని.. దానికి టీఆర్ ఎస్ కారణమా? అన్నది కేసీఆర్ క్వశ్చన్.

నిజమే.. ఆయన మాటలో అర్థం ఉంది. కాదనరు. కానీ.. ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో హైదరాబాద్ లో కూలిన నిర్మాణంలోని భవనాలు ఎన్ని? వాటికి ఎవరు జవాబుదారి? గత ప్రభుత్వాల కారణంగా చెరువులు కబ్జా అయ్యాయని చెప్పే కేసీఆర్.. గడిచిన రెండున్నరేళ్లలో ఏం చేశారు? వాటి నిరోధానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అన్న సూటి ప్రశ్నలు వేసుకుంటే విషయం ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా కబ్జాల్ని.. ఆక్రమణల్ని ఒక్కరోజులో తొలగించలేం. అందుకు ఏళ్లు పడతాయి. కానీ.. గడిచిన రెండున్నరేళ్లలో కేసీఆర్ ఆ కబ్జాల మీద ఏదైనా చర్య షురూ చేశారా? అంటే లేదనే చెప్పాలి. మరి.. అలాంటప్పుడు గత ప్రభుత్వాల్ని విమర్శించే ముఖ్యమంత్రి..తన పాలన గురించి ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోరు?

సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ల మీద రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి తీరుతో అందరికి అర్థమైన విషయం ఏమిటంటే.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను కేసీఆర్ సార్ సీరియస్ గా తీసుకుంటారని. ఇక.. చెరువు మాట్లాడినట్లుగా పెట్టిన పోస్టింగ్ లో జనాల తప్పులతో పాటు.. వారి తప్పులకు అధికారులు.. ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపిన విషయాన్ని కేసీఆర్ పట్టించుకోకుండా.. తాజాగా జరిగిన నష్టమంతా ప్రజల తప్పుల వల్లేనన్నట్లుగా చెప్పటం గమనార్హం. తప్పులు చేసే వారిని తప్పులు చేయకుండా చూడాల్సిన పని సర్కారుది. మరి.. ఆ విషయంలో కేసీఆర్ సర్కారు ఇప్పటివరకూ ఏం చేసినట్లు? ప్రతిదానికి గత ప్రభుత్వాలంటూ విరుచుకుపడే కేసీఆర్.. తాను అధికారం చేపట్టి దాదాపు రెండున్నరేళ్లకు దగ్గర పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News