బెజ‌వాడ‌లో రిట‌ర్న్ గిఫ్ట్ ఫ్లెక్సీ!

Update: 2019-05-31 04:57 GMT
తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన అనంత‌రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్ట‌టం.. ఆ సంద‌ర్భంగా బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేయ‌టం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు కాంగ్రెస్ తో  జ‌త క‌ట్టిన బాబుకు అంత‌కంతా బ‌దులు తీర్చుకుంటాన‌నే విష‌యాన్ని రిట‌ర్న్ గిప్ట్ పేరుతో వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.

నాటి నుంచి రిట‌ర్న్ గిఫ్ట్ అనే సాఫ్ట్ మాట కాస్తా రాజ‌కీయంగా పంచ్ ఇచ్చే ప‌దంగా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వేలు పెడ‌తామ‌ని కేసీఆర్.. కేటీఆర్ లు చెప్పినా.. త‌ర్వాత కాస్త త‌గ్గిన వైనం తెలిసిందే. తాము వేలు పెడితే.. దాన్నో భావోద్వేగ అంశంగా మార్చి బాబు ల‌బ్థి పొంద‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో.. ఏపీ ఎన్నిక‌ల్లో త‌మ జోక్యం ఉండ‌ద‌న్న మాట‌ను చెప్పేయ‌టం తెలిసిందే.

బాబుకు బై.. బై చెప్పేసిన  ఏపీ ప్ర‌జ‌లు.. జ‌గ‌న్ కు ల్యాండ్ స్లైడ్ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. తాజాగా అంగ‌రంగ‌ర వైభ‌వంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్‌.. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ స‌భ‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక అతిధి హోదాలో హాజ‌ర‌య్యారు. త‌మిళ‌నాడు విప‌క్ష నేత‌.. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా విచ్చేశారు. వీరిద్ద‌రితో పాటు.. జ‌గ‌న్ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌టానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కూడా బెజ‌వాడ‌కు వ‌చ్చారు. వీరంద‌రికి గేట్ వే హోట‌ల్లో బ‌స ఏర్పాటు చేశారు.

ఆ హోట‌ల్ కు ప‌క్క‌నే ఒక ఫ్లెక్సీ ఏర్పాటైంది. జ‌గ‌న్ కు కేసీఆర్ బొకే ఇస్తున్న ఫోటోతో ఉన్న ఈ ఫ్లెక్సీ మీద థ్యాంక్స్ కేసీఆర్ గారు.. ఫ‌ర్ ద రిట‌ర్ను గిఫ్ట్ అని రాసి ఉంది. ఈ ఫ్లెక్సీ ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ బ‌స చేసిన హోట‌ల్ ప‌క్క‌నే ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ.. కేసీఆర్ కంట్లో ప‌డే ఛాన్స్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News