బాబుకేనా.. వాళ్ల‌కు ఇవ్వ‌రా రిట‌ర్న్ గిఫ్ట్‌?

Update: 2019-01-01 05:42 GMT
కొన్ని మాట‌ల‌కు కొంద‌రి పుణ్య‌మా అని వ‌చ్చే ఇమేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి కోవ‌లోకే చెందుతుంది రిట‌ర్న్ గిఫ్ట్ మాట‌. ఇప్ప‌టివ‌ర‌కూ చిన్న పిల్ల‌లు.. యూత్‌.. ఏదైనా శుభ‌కార్యాలు నిర్వ‌హించే వారి నోటి వెంట‌నే అదే ప‌నిగా వ‌చ్చే రిట‌ర్న్ గిఫ్ట్ మాట‌.. ఇప్పుడు బ్ర‌హ్మాండ‌మైన రాజ‌కీయ పంచ్ గా మారింది. ఇప్పుడీ ప‌దం చాలామంది  నేత‌ల నోట అదే ప‌నిగా వినిపిస్తోంది. దీని క్రెడిట్ అంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం.. దానికి మీడియాలోనూ.. ప్ర‌జ‌ల్లోనూ విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించ‌టం తెలిసిందే. అయితే.. దీనికి గ‌ట్టి పంచ్ ఇవ్వ‌టంలో తెలుగు త‌మ్ముళ్లు అడ్డంగా ఫెయిల్ అయిన‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌పై విసిరిన పంచ్ ల‌కు రిట‌ర్న్ పంచ్ లు ఇచ్చే విష‌యంలో బాబు ఎప్పుడూ ధీటుగా స్పందించింది లేదు. ఒక‌వేళ‌.. రియాక్ట్ అయినా ఆయ‌న‌కు ఇబ్బందే. దీంతో పోలిస్తే ఏపీలోని అంత‌మంది తెలుగు త‌మ్ముళ్ల‌లో ఏ ఒక్క‌రూ ధీటుగా స్పందించినా.. దానికి వ‌చ్చే మైలేజీ లెక్క వేరు ఉంటుంది.

కానీ.. అన్ని తెలివితేట‌లు తెలుగు త‌మ్ముళ్ల‌లో లేవ‌నే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రచారం చేసిన చంద్ర‌బాబుకు గ‌ట్టి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌కు అంతే ధీటుగా ఇచ్చేందుకు ఒక లాజిక్ ఉన్నా దానిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్న మాట కొంద‌రి నోట వినిపిస్తోంది. అయితే..వారంతా టీఆర్ ఎస్‌ కు చెందిన నేత‌లు కావ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ తీరుతో గుర్రుగా ఉన్న వారు.. రిట‌ర్న్ గిఫ్ట్‌కు త‌గిన కౌంట‌ర్ గురించి లోగుట్టుగా చెబుతున్నారు.

తెలంగాణలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఒక్క‌రే కాద‌ని.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో పాటు.. మ‌హ‌రాష్ట్రతో పాటు.. ప‌లు బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌టం.. కేసీఆర్ పాల‌న‌పై పంచ్ లు వేశారు. మ‌రి.. వారంద‌రూ ప్ర‌చారం చేస్తే లేని నొప్పి బాబు విష‌యంలో కేసీఆర్‌ కు ఎందుకు వ‌స్తుంద‌న్న ప్ర‌శ్న‌ను తెలుగు త‌మ్ముళ్లు ఎందుకు సంధించ‌టం లేద‌ని అడుగుతున్నారు.

రిట‌ర్న్ గిఫ్ట్ బాబుకేనా?  మోడీకి.. అమిత్ షాకు.. మిగిలిన ముఖ్య‌మంత్రుల‌కు కేసీఆర్ ఎందుకు ఇవ్వ‌ర‌ని నిల‌దీయ‌రే? అని అడుగుతున్న వైనం చూస్తే.. కేసీఆర్‌కు స‌రైన బ‌దులివ్వ‌గలిగిన మొన‌గాడిత‌నం గులాబీ బ్యాచ్‌కే ఉంద‌న్న అభిప్రాయం క‌లుగ‌క మాన‌దు. బాబు ఎలా విమ‌ర్శించారో.. మోడీ కూడా అదే తీరులో  పంచ్ లు విసిరార‌న‌ని.. అలాంట‌ప్పుడు బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేట‌ప్పుడు మోడీకి కూడా ఇవ్వాలి క‌దా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు.

మోడీకి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌టం త‌ర్వాత‌.. ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని ఎదుట వంగిన వంగుడుపై గులాబీ బ్యాచ్ లోని కొంద‌రు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేని వారు.. త‌మ స‌న్నిహితుల వ‌ద్ద త‌మ మ‌న‌సులోని మాట‌ను చెబుతున్నారు. బాబుకు వేసే పంచ్ లు మోడీకి వేయాల‌న్న ఉద్దేశం వారి మాట‌ల్లో వినిపిస్తోంది. అలా కాని ప‌క్షంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కారుకు క‌మ‌లానికి మ‌ధ్య దోస్తానా ఉంద‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగితే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా ఎంపీ సీట్లు రాకుంటే విప‌క్షాలు మ‌ళ్లీ పుంజుకుంటాయ‌న్న ఆందోళ‌న వారి మాట‌ల్లో వినిపిస్తోంది.


Full View

Tags:    

Similar News