మంత్రి మాట‌కు హ‌ర్ట‌య్యే..కేసీఆర్ కొత్త సెక్ర‌టేరియ‌ట్

Update: 2018-01-19 04:31 GMT
తెలంగాణ  ముఖ్య‌మంత్రిగా టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ ప‌గ్గాలు స్వీక‌రించిన త‌ర్వాత చేయాల‌నుకొని చేయ‌లేని ప‌నుల జాబితా తీస్తే అందులో ముందుగా క‌నిపించేది కొత్త సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం. వాస్తుపై విప‌రీత‌మైన న‌మ్మ‌కం ఉన్న కేసీఆర్ కొత్త స‌చివాల‌యం నిర్మాణం కోసం ముందుకు సాగుతున్నార‌ని  పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.అయితే ఇదొక్క‌టే కార‌ణం కాద‌ట‌...దీని వెనుక మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణం ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది స్వ‌యంగా కేసీఆర్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇండియా టుడే ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సౌత్ కాంక్లేవ్‌ లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌ దీప్ స‌ర్దేశాయ్ మాట్లాడుతూ `ఎందుకు అంతగా వాస్తును నమ్ముతారు.. వాస్తుకోసమే సీఎం కేసీఆర్‌ సచివాలయాన్ని మారుస్తున్నారని విన్నాం. అందుకోసం రూ. 100 కోట్లకుపైగా ఖర్చుపెట్టనున్నారని అంటున్నారు. అంతా బాగా జరుగుతున్నప్పుడు ఎందుకు వాస్తును నమ్ముతున్నారు? అని ప్ర‌శ్నించ‌గా..కేసీఆర్ త‌న‌దైన శైలిలో రిప్లై ఇచ్చారు. ` చిన్న సవరణ.. రూ. 100 కోట్లు కాదు.. రూ. 250 కోట్లను కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఖర్చు పెట్టబోతున్నాం! ఎందుకు అంటే కార‌ణాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న సచివాలయానికి వెళదాం.. మీకు చూపెడతాను.. అదెంత వంకరటింకరగా.. ఇబ్బందికరంగా ఉందో అర్థమవుతుంది. 25 ఎకరాల్లో ప్రస్తుత సచివాలయం ఉంది. విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు చాలా మంది నాతో అన్నారు. మలేషియాకు చెందిన సీనియర్‌ మినిస్టర్‌ వేలు నా మొహం మీదే అడిగారు. కేసీఆర్‌ ఈ స్థలాన్ని అమ్మేయవచ్చుకదా.. పుత్రజయ లాంటి కొత్త సచివాలయాన్ని నిర్మించుకోవచ్చుకదా అని అన్నారు. ఇక్కడి ప్రజలు సెంటిమెంట్‌ తో ఉంటారు. ముఖ్యమంత్రి సచివాలయాన్ని అమ్ముకున్నారని అపార్థం చేసుకుంటారని - స్థలాన్ని అమ్మనని చెబుతూ.. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని మాత్రం చెప్పాను` అని స‌చివాల‌యం కొత్త కోణాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు.

తెలంగాణ సీఎం హైదరాబాద్‌ నిజాంలాగా ఉంటున్నారనే విమర్శలున్నాయి..నూతన గృహం ఉంది కదా కొత్త సచివాలయం ఎందుకు అని రాజ్‌ దీప్ రెట్టించి ప్ర‌శ్నించ‌గా...`కొందరు పిచ్చివాళ్ళు అలా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. అది నా ఇల్లు కాదు. అది సీఎం నివాసం. నేను నిర్మించిన ప్రగతిభవన్‌ లో సీఎం నివాసం - కార్యాలయం - వివిధ వర్గాలు - సమాజంలోని వివిధ రకాల సంస్థలు - ప్రజలతో సమావేశం అయ్యేందుకు అద్భుతమైన సమావేశ మందిరం నిర్మించాం. అది కేవలం కేసీఆర్‌ ఇల్లు కాదు. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం. అది మన రాష్ట్ర గౌరవానికి చిహ్నం వంటిది. రానున్న వందేళ్ల‌ వరకు ఆ భవనం ఉంటుంది. అందులో రానున్న ఎంతోమంది తెలంగాణ ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. సెక్ర‌టేరియ‌ట్ వేరు..ముఖ్య‌మంత్రి నివాసం వేరు` అని కేసీఆర్ త‌న‌దైన శైలిలో వివ‌రించారు.
Tags:    

Similar News