ఓటుకు నోటు కేసు మోదీ కుట్రే: కేసీఆర్

Update: 2018-11-28 06:24 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌చారంలో లేని కొత్త విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు రేవంత్ రెడ్డి(అప్ప‌ట్లో టీడీపీలో ఉన్నారు) డ‌బ్బులు ఎర‌వేయ‌డం - ఏసీబీ అధికారులు బ‌య‌ట‌పెట్టిన ఓ వీడియోలో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడిన‌ట్లు ఉన్న‌ ఫోన్ కాల్ రికార్డు కూడా బ‌య‌టికొచ్చింది. దీంతో చంద్ర‌బాబు కూడా చిక్కుల్లో ప‌డ్డారు. వాస్త‌వానికి అప్ప‌ట్లో చంద్ర‌బాబును అరెస్టు చేసేందుకు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని.. అయితే - చంద్ర‌బాబు ఫోన్ ట్యాపింగ్ కేసును తెర‌పైకి తీసుకురావ‌డంతో అరెస్టు నిలిచిపోయింద‌ని విశ్లేష‌కులు చెబుతుంటారు.

తాజాగా మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ లో టీఆర్ ఎస్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాని మోదీ హ‌స్తం కూడా ఉంద‌ని ఆరోపించారు. త‌మ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకే చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి మోదీ ఈ కుట్ర ప‌న్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ‌లో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని అప్ప‌ట్లో వారు ప్ర‌ణాళిక‌లు ర‌చించార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు జ‌రుగుతున్న కుట్ర‌పై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ త‌న‌కు తొలుత స‌మాచార‌మిచ్చార‌ని కేసీఆర్ తెలిపారు. అనంత‌రం ఏసీపీ పక్కా ప్ర‌ణాళిక‌తో మోదీ - చంద్ర‌బాబు కుట్ర‌ను భ‌గ్నం చేసింద‌ని వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డిని అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకున్న సంగ‌తిని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో గ‌తంలో ఎప్పుడూ ప్ర‌ధాని మోదీ పేరును కేసీఆర్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News